Off The Record about: అన్ని పంచాయతీల్లో బీజేపీ పోటీ.. అంత సీన్ ఉందా..?

Off The Record About Can Bjp Really Contest In All Telangana Panchayats Reality Check Behind The Big Claim

Off The Record about: తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పోటీ చేస్తామని చెబుతోంది బీజేపీ. సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్స్‌గా పోటీ చేయమంటూ స్థానిక నేతలకు ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడే ఒక కొత్త చర్చ మొదలైంది పార్టీ వర్గాల్లో. పైవాళ్ళు ఆదేశాలు ఇవ్వడం వరకు బాగానే ఉందిగానీ… కింది స్థాయిలో అసలు మనకంత సీన్‌ ఉందా అని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. ఆశ ఉండవచ్చుగానీ… దురాశ, పేరాశల్లాంటివి పనికిరావుకదా అంటూ వాళ్ళలో వాళ్ళే సెటైర్స్‌ వేసుకుంటున్నారట. ఈ ఎన్నికలు పార్టీ సింబల్ మీద జరగకున్నా… ఆయా పార్టీలు బలపర్చే అభ్యర్థులే బరిలో ఉంటారు. సాధారణంగా ప్రధాన పార్టీల్లో యాక్టివ్‌గా తిరిగే కార్యకర్తలో లేక వాళ్ళ కుటుంబ సభ్యులో పోటీ చేస్తుంటారు. అందుకే బీజేపీ కూడా అన్ని స్థానాల్లో తమ పార్టీ బలపరిచే అభ్యర్థులు ఉంటారని అంటోంది. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కావడానికి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం కీలకం అన్నది పెద్దల ఆలోచన. కానీ… పోటీ అంటే ఊరికే ఉందా? క్షేత్ర స్థాయిలో కనీస బలం లేనిచోట బరిలో దిగి చేతి చమురు ఎవరు వదిలించుకుంటారన్నది ఎక్కువ మంది నేతల ప్రశ్న.

తెలంగాణలో 12 వేల పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో మెజార్టీ గ్రామాల్లో బీజేపీకి కనీసం బూత్ కమిటీ కూడా లేదు. చాలా పోలింగ్ బూత్‌లలో కనీసం పార్టీ జెండా పట్టుకునే వాళ్ళు కూడా లేరు. అలాంటప్పుడు అన్ని ఊళ్ళలో పోటీ ఎలా సాధ్యమన్నది ప్రధానమైన ప్రశ్న. సంస్థాగత ఎన్నికలు జరిగినప్పుడు పోలింగ్ బూత్‌లపై దృష్టి పెడుతుంది బీజేపీ. ఈ సారి ఆ పార్టీ సభ్యత్వంలోనూ, కమిటీలను ఏర్పాటు చేయడంలోనూ గతం కంటే మంచి పెర్ఫార్మెన్స్ నే చూపింది.. అయితే ఆ కమిటీలు ఎంత వరకు యాక్టివ్‌గా ఉన్నాయన్నది ప్రశ్నార్థకమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే క్షేత్ర స్థాయిలో తెలిసిన ముఖం అయిఉండాలి. ఆ ఏరియాలో లోకల్ సమస్యలు తెలిసి, స్పందించిన వాళ్ళయి ఉండాలి. కానీ… బీజేపీ కమిటీల్లో ఉన్న వాళ్ళలో మెజారిటీ ఉన్నామంటే ఉన్నాం…. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అనే బాపతు. అలాంటి వాళ్ళంతా ఎన్నికల బరిలో నిలిచి ఏం సాధిస్తారన్న ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే అంగ బలం, అర్థ బలం ముఖ్యం. గ్రామ స్థాయిలో ఉన్న మెజార్టీ బీజేపీ లీడర్స్‌లో ఆ లక్షణాలు లేవు.

ఇక పార్టీ ముఖ్య నేతలు కూడా క్షేత్ర స్థాయిలో నాయకత్వాన్ని బలోపేతం చేయడంపై ఇన్నేళ్ళలో పెద్దగా దృష్టి పెట్టలేదన్న విమర్శలున్నాయి. ఎవరో ఒకరిద్దరు అక్కడక్కడ తమ వ్యక్తిగత ఛరిష్మాతో ప్రభావం చూపుతున్న వాళ్ళే తప్ప… పార్టీ పరంగా బలమైన లీడర్‌షిప్ కోసం ఎప్పుడూ ప్రయత్నం జరగలేదు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలైతే… ప్రధాని మోడీని చూసో, మరో నాయకుడిని చూసో ఓట్లు వేస్తారుగానీ….పంచాయతీల్లో అలాంటి పరిస్థితి ఉండదుకదా అన్నది తెలంగాణ కాషాయ దళంలో జరుగుతున్న చర్చ. చివరికి గ్రామాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు, పథకాలు వస్తున్నా… వాటి గురించి కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు పంచాయతీ బరిలో ఏం సత్తా చూపిస్తామని బీజేపీ నాయకులే అంటున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న చోట కాస్తో కూస్తో పార్టీ కార్యకర్తలు బరిలో ఉంటారు తప్ప… ఏజెన్సీ ఏరియాల్లో, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ , వరంగల్‌లాంటి చోట్ల సర్పంచ్ అభ్యర్థులను పెట్టే పరిస్థితి లేదన్నది కమలం పార్టీ ఇన్నర్‌ వాయిస్‌.