Off The Record: మీనాక్షి నటరాజన్ వైఖరిపై గాంధీ భవన్ లో గుసగుసలు..!

Off The Record About Leadership Crisis In Telangana Congress Buzz Around Meenakshi Natarajans Controversial Decisions

Off The Record: ఆదర్శంగా ఉండాలని అనుకోవడంలో తప్పు లేదు. గాంధీ సిద్ధాంతాలను ఫాలో అవడం గురించి అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఆ విషయంలో ఎవ్వరికీ అభ్యంతరాలు ఉండకూడదు కూడా. కానీ… తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ తీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా ఉందంటూ ఆ పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే…. ఆమె వ్యవహార శైలి కొరకరాని కొయ్యలా మారిందన్న చర్చ నడుస్తోంది గాంధీభవన్‌లో. స్థానిక నాయకులతో సంబంధం లేకుండానే పని కానిచ్చేస్తున్నారని, ఏమీ చర్చించకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ఏం చేశారంటూ విచారించడం, విషయం తెలిసి సణుక్కోవడం, మరీ ఆపులేకపోతే… గాంధీభవన్‌ గోడలకు గోడు వెళ్ళబోసుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నామంటూ కొందరు నాయకులు ఫ్రస్ట్రేట్‌ అవుతున్నారట. ఒకరిద్దరు చొరవ తీసుకుని సార్‌… ఇదేంటి, ఇలా చేస్తున్నారేంటి అంటూ… రాష్ట్ర నాయకులకు విన్నవిస్తే… వాళ్ళు కూడా మా చేతిలో ఏముంది..? అంతా మేడమే అనేస్తున్నారట. ముఖ్యంగా డీసీసీ అధ్యక్షుల నియామకానికి ముందు పార్టీ నేతలకు చాలా విషయాలు చెప్పారు మీనాక్షి నటరాజన్.

కానీ… ఆ మాటలకు, జరిగిన దానికి అస్సలు పొంతనే లేదన్నది తాజా వాదన. పార్టీకి ఏది లాభమో…అదే చేస్తే తప్పులేదు. కానీ…నియామకాలకు ముందు పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం ఎందుకనేది వాళ్ళ ప్రశ్న. పార్టీలో ఒకరికి ఒకే పదవి అన్నారు. ఒక పోస్ట్‌ ఉంటే ఇంకోదానికి ఛాన్సే లేదన్నారు. కానీ… ప్రభుత్వ విప్.. బీర్ల ఐలయ్యకి యాదాద్రి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. దాంతో ఆయన్ని మంత్రి పదవి రేస్‌ నుండి తప్పించడానికే ఈ ఎత్తుగడ వేశారా..అన్న చర్చ నడుస్తోంది. అలాగే… ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్స్‌కు కూడా డీసీసీ పీఠాలు దక్కాయి. పాత DCC అధ్యక్షులకు తిరిగి పదవులు ఇవ్వబోమన్నారు. కానీ… ఎమ్మెల్యేలుగా ఉన్న డీసీసీ అధ్యక్షులను అలాగే కంటిన్యూ చేశారు. ఎమ్మెల్యేలు కాని వాళ్ళలో మెదక్, ములుగు, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులను కొనసాగించారు. అలాగే పీసీసీ కమిటీలో ఉన్న వాళ్లకు పదవులు దక్కాయి. ఆరుగురు జనరల్ సెక్రటరీలు, ముగ్గురు ఉపాధ్యక్షులను జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులుగా నియమించారు. ఇక నాయకుల కుటుంబ సభ్యులకు పదవులు లేవంటూ భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారు మీనాక్షి. కానీ…సిద్దిపేట పగ్గాలు dcc మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి కూతురుకు దక్కాయి. మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే భార్యకు డీసీసీ పీఠం దక్కింది.

హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎక్కడి నుండి వచ్చారన్నది పార్టీలో ఎవరికీ అంతుచిక్కడం లేదట. కర్నూలు నుండి వచ్చి సెటిల్ అయిన వాళ్ళకు ఇచ్చారని మైనార్టీ నేతలే ఫిర్యాదు చేస్తున్నారు. జనగామ జిల్లాను ఆశించిన జంగా రాఘవ రెడ్డి నారాజ్ లో ఉన్నారు. ఐదేళ్ల కాలం పార్టీలో ఉంటేనే పదవి అని చెప్పారు…కానీ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చి పోటీ చేసిన ఆత్రం సుగుణకి ఎలా ఇచ్చారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ రకంగా డీసీసీ అధ్యక్షుల నియామకంలో మొత్తం కంగాళీనే నడిచిందని, రాష్ట్ర ఇన్ఛార్జ్‌ స్థాయిలో ఒక స్టేట్‌మెంట్‌ ఇస్తే దానికి కట్టుబడి ఉండటానికి బదులు ఈ పిల్లి మొగ్గలేంటంటూ…కాంగ్రెస్‌ నాయకులు ఫీలవుతున్నారు. ఒకవేళ వీలవకుంటే… ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పి బిల్డప్‌లు ఇవ్వడం ఎందుకన్నది వాళ్ళ క్వశ్చన్‌.