Off The Record: కవితకు బీఆర్ఎస్ కౌంటర్స్.. కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..?

Off The Record About Brs Vs Kavitha Did Kcr Give The Green Signal For Counter Attacks Political Tensions Rise

Off The Record: తగ్గేదేలే…. ఇక మాటల్లేవ్‌…. మాట్లాడుకోవడాల్లేవ్‌…. అన్నీ పోట్లాడుకోవడాలేనని అంటున్నారట బీఆర్‌ఎస్‌ నాయకులు. కేసీఆర్‌ కుమార్తెగా గౌరవించి ఇన్నాళ్ళు కామ్‌గా ఉన్నామని, ఇక మాటకు మాట సమాధానం చెబుతామని అంటున్నారు. పార్టీ హై కమాండ్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడమే అందుకు కారణమని తెలుస్తోంది. జాగృతి జనం బాట పేరుతో ప్రస్తుతం రాష్ట్ర పర్యటనలో ఉన్న కవిత…. తాను వెళ్ళిన ప్రతిచోట స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులను, ప్రత్యేకించి మాజీ మంత్రులను టార్గెట్‌ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్‌ కంటే ఎక్కువగా తమను లక్ష్యంగా చేసుకుని కవిత ఆరోపణలు, విమర్శనాస్త్రాలను సంధించడం అస్సలు మింగుడుపడ్డం లేదట గులాబీ దళానికి. ఈ క్రమంలో… ఇక ఉపేక్షించవద్దని, రివర్స్‌ అటాక్‌ మొదలుపెట్టమంటూ పార్టీ అధ్యక్షుడి నుంచి కొందరు నాయకులకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అందుకే వాళ్లు స్వరం సవరించుకున్నట్టు తెలుస్తోంది. కవిత తొలి నుంచి బీఆర్‌ఎస్‌లోనే ఉండటం, పార్టీ వ్యవహారాలు, నాయకుల తీరు గురించి సకలం తెలిసిన కారణంగా… ఆమె కొన్ని ఆధారాలతోనే ఆరోపణలు చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. కానీ… ఆమె ఏం అన్నా… ఎలాంటి ఆరోపణలు చేసినా, ఇన్నాళ్ళు లైట్‌ తీసుకున్నారు బీఆర్‌ఎస్‌ లీడర్స్.

కానీ… ఎక్కువ కాలం ఇలాగే చూస్తూ కూర్చుంటే… తమకు పబ్లిక్‌లో డామేజ్ అవుతుందని భావిస్తున్న పార్టీ నాయకులు విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళారట. కవిత పార్టీతో పాటు తమ సొంత ఇమేజ్‌ని కూడా డ్యామేజ్‌ చేస్తున్నారని, ఏం చేయమంటారో చెప్పండని అడగడంతో… ఆయన కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసినట్టు సమాచారం. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కవిత చేసిన పోస్ట్ పై తీవ్రస్థాయిలో స్పందించారు బీఆర్ఎస్ నాయకులు. కారణజన్ముడి కడుపున రాక్షసి పుట్టిందంటూ పార్టీ నాయకుల రియాక్షన్‌ అందులో భాగమేనని అంటున్నారు. అయితే… ఆ కామెంట్స్ చిన్న స్థాయి నేతల నుంచి రావడంతో కవితతో పాటు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. పుచ్చలు లేచిపోతాయి అంటూ నిరంజన్ రెడ్డిని ఉద్దేశించి కవిత అనడంతో… ఆయన కూడా అంతకు మించిన స్థాయిలో స్పందించారు. అసలు బీఆర్‌ఎస్‌ ఓటమికి కవితే కారణం అంటూ రివర్స్‌ అటాక్‌ చేశారాయన. ఆమె చేసిన అవినీతి వల్లే పార్టీకి, తమకు ఈ గతి పట్టిందంటూ బరస్ట్‌ అయిపోయారు. కవితకు లిక్కర్ క్వీన్‌ అని ప్రత్యేకమైన బిరుదు ఉన్న విషయం అందరికీ తెలిసిందేనంటూ నిరంజన్‌ రెడ్డి కామెంట్‌ చేయడం కలకలం రేపుతోంది.

ఇలా…. ఇక నుంచి ఆమె విమర్శించిన వెంటనే ప్రతి ఒక్క నాయకుడు అటాక్‌ మోడ్‌లోకి వెళ్ళాలని పార్టీ నుంచి కీలక ఆదేశాలు వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అసలు కేసీఆర్‌ నుంచి క్లియరెన్స్‌ వచ్చాకే నిరంజన్‌ రెడ్డి ఆ స్థాయిలో రియాక్ట్‌ అయినట్టు చెప్పుకుంటున్నారు. కవిత ఒక్క మాట మాట్లాడితే మనం రెండు అనాలని బీఆర్‌ఎస్‌ నేతలకు పార్టీ సూచించినట్టు తెలుస్తోంది. అందుకే కవిత ఇక ఎవరిని విమర్శించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. కవిత చేస్తున్న ఆరోపణల్ని ఇప్పటికీ పట్టించుకోకుండా ఉంటే అవి నిజమేనని ప్రజలు నమ్మే ప్రమాదం ఉన్నందున పార్టీ పెద్దలు పచ్చ జెండా ఊపారని, అందుకే ఇక మీదట కవిత విషయంలో తగ్గకూడదని అనుకుంటున్నట్టు సమాచారం. ఈ ఊపుతో కొందరు గులాబీ నాయకులైతే… ఆమె బాగోతం మొత్తం మా దగ్గర ఉందని అంటున్నారట. ఎమ్మెల్సీ మా గురించి మాట్లాడితే… మేం కూడా చిట్టా తీస్తామని కామెంట్స్‌ చేయడం ఉత్కంఠ రేపుతోంది. ఏ జిల్లాకు వెళ్లినా అధికార పార్టీని విమర్శించకుండా ప్రతిపక్షంగా ఉన్న తమ జోలికి వస్తే మాత్రం అందుకు తగ్గ కౌంటర్స్‌ రెడీ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో కవిత రియాక్షన్‌ సైతం చర్చనీయాంశం అవుతోంది. నిరంజన్ రెడ్డిని తాను విమర్శిస్తే ప్రతి విమర్శలు చేసి మంచి సంప్రదాయం మొదలుపెట్టారని అనడాన్ని ప్రత్యేకంగా చూడాలని అంటున్నారు పరిశీలకులు. అంటే.. కవిత కూడా రెస్పాన్స్‌ కోరుకుంటున్నట్టే కదా అన్న మాటలు వినిపిస్తున్నాయి. అలా… అటాక్‌, కౌంటర్‌ అటాక్స్‌తో బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కవిత రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.