
చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడంతో మన శరీరం చలికి వణికిపోవడం సాధారణం. ఈ సమయంలో కండరాలు గట్టిపడడం, కీళ్లలో ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, ఫైబ్రోమైయాల్జియా వంటి సమస్యలు ఉన్నవారికి ఈ కాలంలో నొప్పి మరింతగా ఉంటుంది. నిపుణుల ప్రకారం కొన్ని సులభమైన జీవనశైలి మార్పులతో ఈ సీజన్లో కండరాలు, కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు.
వెచ్చగా ఉండే దుస్తులు ధరించండి
చల్లని గాలి కండరాలు మరియు కీళ్లను గట్టిపరుస్తుంది.ఎప్పుడూ వెచ్చని దుస్తులు, గ్లౌవ్స్, సాక్స్, స్కార్ఫ్ వంటి వస్త్రాలు ధరించడం మంచిది. వేడి నీటితో స్నానం చేయడం ద్వారా కండరాలు రిలాక్స్ అవుతాయి మరియు రక్త ప్రసరణ మెరుగవుతుంది.
ఉదయం వాకింగ్, వ్యాయామం తప్పనిసరి
చలికాలంలో మనం బయటకు వెళ్లేందుకు బద్ధకిస్తాం, దీంతో శరీరం మొద్దుబారుతుంది.ప్రతిరోజూ ఉదయం నడక, స్ట్రెచింగ్, తేలికపాటి వ్యాయామాలు చేస్తే కండరాలు యాక్టివ్‌గా ఉంటాయి. వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరచడంతో కీళ్లలోని ఒత్తిడి తగ్గుతుంది.
బరువు నియంత్రణపై దృష్టి పెట్టండి
చలికాలంలో అతిగా తినడం, తక్కువ కార్యాచరణ వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. పెరిగిన బరువు కీళ్లపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. సలాడ్లు, పండ్లు, కూరగాయలు, పప్పుదినుసులు, తేలికపాటి ప్రోటీన్లు తీసుకోవడం అనుకూలం. బెర్రీలు, ఎండిన పండ్లు, చేపలు, వెల్లుల్లి వంటి ఆహారాలు శరీరంలోని మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచండి
చలికాలంలో నీరు తాగే అలవాటు తగ్గుతుంది, దీని వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. నీరు తక్కువగా తీసుకోవడంతో కీళ్ల సరళత తగ్గి నొప్పి పెరుగుతుంది. క్రమంగా నీరు, హెర్బల్ టీ, సూప్, తాజా ఫలరసాలు తీసుకోవడం మంచిది.
వెచ్చని కంప్రెస్‌లు ఉపయోగించండి
కండరాలు గట్టిపడడం లేదా తేలికపాటి నొప్పి ఉన్నప్పుడు వెచ్చని కంప్రెస్‌లు, హీటింగ్ ప్యాడ్లు ఉపశమనం అందిస్తాయి. స్వల్ప వాపు ఉంటే డాక్టర్ సూచించిన మందులు వాడవచ్చు. నొప్పి ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.
ఈ సమాచారం మొత్తం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించినది. మీకు చలికాలంలో కండరాలు లేదా కీళ్ల నొప్పి తీవ్రంగా ఉంటే, ఏ సూచనలను పాటించే ముందు వైద్యులు లేదా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.