Cyclone Ditwah: శ్రీలంకలో దిత్వా తుఫాను బీభత్సం.. 56 మంది మృతి

56 People Died In Sri Lanka Deadly Floods

శ్రీలంకలో దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టించింది. పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. ఇంకోవైపు కొండచరియలు విరిగిపడడంతో ఆస్తి, ప్రాణ నష్టం బాగా జరిగింది. వరదలు కారణంగా ఇప్పటి వరకు 56 మంది చనిపోయారు. మరోవైపు కార్యాలయాలు, పాఠశాలలు మూసివేశారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు సహాయ చర్యలు చేపట్టారు.

దేశవ్యాప్తంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 56కు చేరుకుందని.. 21 మంది ఆచూకీ గల్లంతైందని.. 600కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు శుక్రవారం తెలిపారు. గురువారం నుంచి భారీ వర్షాలు కురవడంతో ఇళ్లు, పొలాలు, రోడ్లు నీట మునిగినట్లుగా వెల్లడించారు. ఇక 12,000 కుటుంబాలకు చెందిన దాదాపు 44,000 మంది ప్రజలు వరద బారిన పడ్డారు. ఇళ్లు ధ్వంసం కావడంతో పాటు రవాణా వ్యవస్థలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.

గత 24 గంటల్లో వవునియాలోని చెడ్డికులంలో 315 మి.మీ, ముల్లైతీవులోని అలపల్లిలో 305 మి.మీ, అనేక జిల్లాల్లో 200 మి.మీ వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరించారు. ఇక వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.