Trump: కాల్పుల ఎఫెక్ట్.. గ్రీన్‌ కార్డ్ హోల్డర్స్‌కు కష్టాలే!.. ట్రంప్ కీలక ఆదేశాలు

Trump Orders Review Of Green Cards

అగ్ర రాజ్యం అమెరికా పరిపాలన కేంద్రం వైట్‌హౌస్ దగ్గర కాల్పులు తీవ్ర అలజడి రేకెత్తించింది. నేషనల్ గార్డ్స్‌పై ఆప్ఘని వాసి జరిపిన కాల్పులు అధ్యక్షుడు ట్రంప్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఇద్దరు గార్డ్స్‌పై కాల్పులు జరపగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొకరు చికిత్స పొందుతున్నారు.

ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు జంతువు.. పిచ్చోడు అంటూ మండిపడ్డారు. జో బైడెన్ ప్రభుత్వం కారణంగానే ఇదంతా జరిగిందంటూ ట్రంప్ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జో బైడెన్‌ను ఎందుకు నిందిస్తున్నారంటూ నిలదీసిన విలేకరిపై కూడా ట్రంప్ మండిపడ్డారు. తెలివి తక్కువవారా? అంటూ పదే పదే రుసరుసలాడారు.

నిందితుడు రహ్మానుల్లా లకన్వాల్‌ ఆప్ఘన్ జాతీయుడుగా గుర్తించారు. 2021 ఆగస్టులో ఆప్ఘన్‌స్థాన్‌లో బైడెన్ ప్రభుత్వం అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకుంది. దీంతో తాలిబన్లు ఆప్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్నారు. ఆ సమయంలో బైడెన్ ప్రభుత్వం ఆపరేషన్ అల్లీస్ వెల్కమ్ పునరావాస కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 70, 000 ఆప్ఘన్ జాతీయులు అమెరికాలోకి ప్రవేశించారు. అలా ప్రవేశించినవాడే రహ్మానుల్లా. బైడెన్ నిర్ణయం కారణంగానే ఈరోజు అమెరికాలో ఉగ్ర దాడి జరిగిందంటూ ట్రంప్ ఫైరయ్యారు.

పునరావాస కార్యక్రమం ద్వారా ప్రవేశించిన వారికి శాశ్వత హోదా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం వీలు కల్పించింది. రహ్మానుల్లా కూడా డిసెంబర్ 2024లో శాశ్వత ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ట్రంప్ అధికారం చేపట్టిన మూడు నెలల తర్వాత.. అనగా ఏప్రిల్ 23న ఆమోదించబడింది. రహ్మానుల్లా ప్రస్తుతం వాషింగ్టన్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతడికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేనట్లుగా ఒక అధికారి తెలిపారు.

అయితే రహ్మానుల్లా ఉన్నట్టుండి ఉన్మాదిలా మారి వైట్‌హౌస్ దగ్గర కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తాజాగా కాల్పుల ఘటన నేపథ్యంలో ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రీన్ కార్డు హోల్డర్స్ వీసాలను సమీక్షించాలని ఆదేశించారు. దీంతో ఆప్ఘన్ జాతీయుల గ్రీన్ కార్డులను అధికారులు సమీక్షిస్తున్నారు. ఇక ఇంటర్వ్యూలకు అని పిలిచి పలువురిని అరెస్ట్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొత్తగా ఆప్ఘన్ జాతీయుల దరఖాస్తులను కూడా నిలిపివేసేశారు. మరోవైపు వీసాల గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్న వాళ్లను కూడా అదుపులోకి తీసుకుంటున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.