
చాలా మంది ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగుతూ తమ రోజును ప్రారంభిస్తారు. దీంతో ఆరోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటామని భావిస్తుంటారు. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఈ అలవాటు దీర్ఘకాలంలో కొన్ని సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. నేటి బిజీ లైఫ్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే.
అందుకే, ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగే బదులు, ఖాళీ కడుపుతో రెండు ఖర్జూరాలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. టిఫిన్‌కు ముందే ఖర్జూరాలు తినడం వల్ల ఎనర్జీ లెవల్స్ సహజంగా పెరుగుతాయి. కాఫీ లేదా టీ ఇచ్చే శక్తి తాత్కాలికమే; కానీ ఖర్జూరాలు ఇచ్చే శక్తి మాత్రం మెల్లగా, దీర్ఘకాలం పనిచేస్తుంది.
ఖర్జూరాలలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి మూడు రకాల సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరంలో తక్షణ శక్తిని అందిస్తాయి. రోజువారీ ఆహారంలో ఖర్జూరాలను చేర్చుకుంటే, తరచూ తీపి తినాలనిపించే కోరిక కూడా తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అదే విధంగా, ఖర్జూరాలలో ఉన్న అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీని వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. భోజనం తర్వాత వచ్చే అసౌకర్యాలు తగ్గడంతో పాటు, మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.
ఇక్కడ పేర్కొన్న సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సంకలితం చేసినది. ఏ ఆహారపు మార్పులు చేయేముందు లేదా కొత్త అలవాట్లు ప్రారంభించేముందు, తప్పనిసరిగా మీ వైద్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది.