Donald Trump: “మూడో ప్రపంచ దేశాల” నుంచి వలసల్ని అనుమతించం.. భారత్ ఈ జాబితాలో ఉందా.?

Trump Announces Permanent Pause On Migration From All Third World Countries After White House Shooting

Donald Trump: వైట్ హౌజ్‌లో సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సెక్యూరిటీ సిబ్బందిపై ఆఫ్ఘాన్ జాతీయుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ‘‘మూడో ప్రపంచ దేశాల’’ నుంచి అమెరికాలోకి వలసల్ని శాశ్వతంగా నిలిపివేస్తామని ప్రకటించారు. దీని వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కొలుకుంటుందని చెప్పారు. ట్రంప్ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా భారీ ప్రభావాన్ని చూపిస్తుంది. మెరుగైన జీవితం, విద్య, సొంత దేశాల్లోని హింస నుంచి తప్పించుకుని అమెరికాలోకి వలస వెళ్లే లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తుంది.

Read Also: CM Chandrababu: రైతుల సహకారం మరువలేనిది.. అమరావతిని వినూత్నంగా నిర్మిస్తున్నాం!

ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో ‘‘ అమెరికా సాంకేతికంగా పురోగతి సాధించినప్పటికీ, దాని వలస విధానం చాలా మంది జీవన పరిస్థితుల్ని నాశనం చేసింది’’ అని కామెంట్ చేశారు. బైడెన్ హయాంలో అక్రమ ప్రవేశాలను రద్దు చేస్తామని చెప్పారు. అమెరికాను ప్రేమించలేని వారిని తొలగిస్తామని, అమెరికాకు చెందని వారి ఫెడరల్ ప్రయోజనాలను, సబ్సిడీలను ఇప్పటికే ముగించానని, పాశ్చాత్య నాగరికతకు అనుకూలంగా లేని ఏ విదేశీయుడినైనా బహిష్కరిస్తాననని ట్రంప్ చెప్పారు. అమెరికాకు ఉపయోగం లేని వారిని, హత్యలకు నేరాలకు పాల్పడే వారిని దేశం నుంచి గెంటేస్తామని చెప్పారు.

మూడో ప్రపంచ దేశాలు అంటే ఏమిటి.?

మొదటి, రెండో, మూడో ప్రపంచ దేశాలు అనే భావన 20వ శతాబ్ధం మధ్యలో కోల్డ్ వార్ సమయంలో వచ్చింది. మొదటి ప్రపంచ దేశాల్లో అమెరికా, నాటో మిత్ర దేశాలు, పశ్చిమ యూరప్ దేశాలు, జపాన్, ఆస్ట్రేలియా ఉన్నాయి. రెండో ప్రపంచం అంటే సాధారణంగా కమ్యూనిస్ట్ సోవియట్ యూనియన్, దాని మిత్రదేశాలైన తూర్పు యూరప్ దేశాలు, క్యూబా, చైనాలను సూచించేది. మూడో ప్రపంచ దేశాలు అంటే సాధారణంగా కోల్డ్ వార్‌లో ఇటు అమెరికా, అటు రష్యా వైపు లేని దేశాలను పిలిచేవారు. ఈ దేశాలు ఎక్కువగా పేద దేశాలు, యూరోపియన్ కాలనీలుగా ఉన్న దేశాలను పిలుస్తారు. ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, లాటిన్ అమెరికా, ఆసియా దేశాలు ఈ జాబితాలో ఉంటాయి.

అయితే, ప్రస్తుత ప్రపంచంలో ‘‘థర్డ్ వరల్డ్ కంట్రీస్’’ అనే పదం పెద్దగా వాడుకలో లేదు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి తక్కువ అభివృద్ధి చెందిన దేశాలుగా పిలుస్తోంది. యూఎన్ జాబితాలో లో డెవలప్ నేషన్స్(LDC) జాబితాలో 44 దేశాలు ఉన్నాయి. ఆసియా నుంచి 8 దేశాలు, కరేబియన్ నుంచి హైతీ, ఫసిఫిక్ దేశాలైన సోలమన్ ఐలాండ్స్, కిరిబాటి, తుపాలు ఉన్నాయి. ఆసియా నుంచి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్‌ ఉన్నాయి.

ప్రస్తుతం, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు, తక్కువ మరియు దిగువ మధ్య తరగతి ఆదాయ దేశాలు వంటి పదాలను ఉపయోగిస్తున్నారు. కోల్డ్ వార్ సమయంలో ఈక్వేషన్ ఉపయోగిస్తే, భారత్ అలీన విధానంతో అమెరికా, సోవియట్ యూనియన్ దేశాలకు దూరంగా ఉంది. దీనిని బట్టి చూస్తే భారత్ ‘‘మూడో ప్రపంచ దేశమే’’. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇటీవల జపాన్‌ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ఈ వివరణను తీసుకుంటే భారత్ ను మూడో ప్రపంచ దేశంగా పరిగణించలేము.