Harish Rao : స్కీంలు లేవుగానీ.. ఎందులో చూసినా స్కాంలు..!

Harish Rao Slams Cm Revanth On Insect Rice Issue

Harish Rao : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకుంటూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా నాణ్యమైన ఆహారం అందించలేని పరిస్థితి నెలకొన్నదని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పురుగులతో కూడిన అన్నం అందించిన ఘటనను గుర్తుచేస్తూ, “ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టండి” అని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు ప్రశ్నించారు. సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నిసార్లు సమీక్షలు జరిపారో, విద్యార్థులకు కల్తీ ఆహారం పెడుతున్న వారిపై ఇప్పటిదాకా ఎన్ని చర్యలు తీసుకున్నారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. “కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామని అన్న మాటలు ఎక్కడికి పోయాయి? మీ మాటలకు విలువ లేదు, ఆచరణలో దిక్కులేదు” అని హరీష్ రావు విమర్శించారు.

పాఠశాలల్లో ఆహార నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, బడిలో చదువుకోవాల్సిన విద్యార్థులే రోడ్ల మీదకు వచ్చి “పురుగులన్నం మాకు వద్దు” అని నిలదీస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. రెండు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కాంలతోనే నిండిపోయిందని, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టలేదని హరీష్ రావు ఆరోపించారు. కొమరం భీం ఆసిఫాబాద్ ఘటనపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.