
Asia Power Index 2025: ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో భారత్ 3వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా లోవీ ఇన్‌స్టిట్యూట్ ఇటీవల తన వార్షిక పవర్ ఇండెక్స్‌ను విడుదల చేసింది. ఇది ముఖ్యంగా ఆసియా ఖండంలోని దేశాలు తమ ఇతర దేశాలపై చూపే ప్రభావ సామర్థ్యాలను అంచనా వేస్తుంది. మొత్తం 27 దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంటే, మొదటి రెండు స్థానాల్లో అమెరికా, చైనాలు నిలిచాయి. నాలుగు, ఐదు స్థానాల్లో జపాన్, రష్యాలు ఉన్నాయి. పాకిస్తాన్ 16వ స్థానంలో ఉంది. భారత్ తన తోటి దేశాల కన్నా ముందున్నప్పటికీ, చైనాతో పోలిస్తే గ్యాప్ ఎక్కువగా ఉంది.
2025లో భారత్ స్కోర్ 40 పాయింట్లను దాటింది. ఆసియాలో మేజర్ శక్తిగా గుర్తింపు పొందింది. జపాన్ కన్నా భారత్ స్పష్టమైన ఆధిక్యతను కనబరించింది. కోవిడ్ తర్వాత భారత్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం, గ్లోబల్ సప్లై చైన్‌లు భారత్ వైపు మళ్లడం భారత్ సత్తాను చాటాయి. దీంతో పాటు తయారీ రంగంలో కూడా భారత్ వేగంగా విస్తరిస్తోంది. ఇక సైనిక శక్తిని చూస్తే, ఈ ఏడాది పాకిస్తాన్‌పై జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో భారత్ తన సామర్థ్యాన్ని చూపించింది. సైనిక సన్నద్ధత మెరుగైంది. చైనాను దాటి భారత్, పెట్టుబడుల కోసం రెండో అత్యంత ఆకర్షణీయమైన దేశంగా మారింది. మొదటిస్థానంలో అమెరికా ఉంది.

Read Also: Akhanda Roxx: ‘అఖండ 2’ సెన్సేషన్.. బాలయ్య పవర్ ఫుల్ ఇమేజ్ కు ప్రత్యేక వాహనం..!
అయితే, పెట్టుబడులు పెరుగుతున్నా, ఆసియా దేశాలతో వాణిజ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండటం భారత్‌కు ప్రతీకూలంగా మారింది. భారత్ ఆర్థిక, సైనిక సామర్థ్యాలు ఉన్నప్పటికీ, ప్రాంతీయ ప్రభావం తక్కువగా ఉంది. దీనిని పవర్ గ్యాప్‌గా చెబుతారు. గతంలో పోలిస్తే భారత్ దౌత్యం కొంచెం మెరుగైంది. పర్యాటక పెరగడం, కొత్త విమాన మార్గాలు ఇవన్ని భారత్ సాఫ్ట్ పవర్‌ను పెంచాయి.
స్కోర్ పరంగా చూస్తే మొదటి స్థానంలో ఉన్న అమెరికా స్కోర్ 81.7గా ఉంటే, చైనా స్కోర్ 73.7గా ఉంది. అమెరికాకు సమీపంగా వచ్చింది. మూడో స్థానంలో ఉన్న భారత్ స్కోరు 40గా ఉంది. చైనాతో పోలిస్తే భారీ గ్యాప్ కనిపిస్తోంది. ఇక రష్యా 2019 తర్వాత మొదటిసారిగా ఆసియాలో తన స్థాయిని పెంచుకుంది. చైనా, ఉత్తరకొరియా వంటి దేశాలతో భాగస్వామ్యాన్ని పెంచుకోవడం కూడా ఒక కారణం.