
India’s GDP: భారత ఆర్థిక వ్యవస్థ దూసుకు పోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 జూలై- సెప్టెంబర్ రెండో త్రైమాసికంలో GDP వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైంది. గత త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి నమోదైంది. గత ఆరు త్రైమాసికాల్లో ఇదే అత్యధికం. గతేడాది ఇదే కాలానికి 5.6 శాతం వృద్ధి రేటు నమోదైంది. జాతీయ గణాంకాల కార్యాలయం (NSO), స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ (MoSPI), జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి స్థూల దేశీయోత్పత్తి (GDP) యొక్క త్రైమాసిక అంచనాలను విడుదల చేసింది.
ప్రపంచ వాణిజ్య అనిశ్చితుల మధ్య బలమైన వినియోగదారుల వ్యయం, తయారీ రంగం కీలక ఇంజన్లుగా వృద్ధిరేటు పెరగడానికి సహకరించాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి, వ్యవసాయం సహా కీలక రంగాల్లో పన్నులు తగ్గించడం కూడా వృద్ధికి దోహదపడింది.
Read Also: Asia Power Index 2025: ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్‌కు 3వ స్థానం.. చైనా, పాక్ ర్యాంకులు ఎంతంటే..
జీడీపీలో 14 శాతంగా ఉన్న తయారీ రంగం రెండో త్రైమాసికంలో 9.1 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది 2.2 శాతంగా ఉంది. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ‘‘వికసిత్ భారత్’’గా మారేందుకు, భారత్ స్థిరమైన ధరల వద్ద సగలున 8 శాతం వృద్ధి రేటు సాధించాల్సి ఉంటుందని జనవరి 31న ప్రవేశపెట్టిన 2024-25 ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ పేర్కొంది. భారత్ డెవలప్డ్ కంట్రీగా మారాలంటే రాబోయే 22 ఏళ్లు సగటున 7.8 శాతం వృద్ధి చెందాల్సి ఉంటుందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది.