Phase-2 Land Pooling: రెండో విడత ల్యాండ్ పూలింగ్..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Ap Cabinet Moves Ahead With Phase 2 Land Pooling For Amaravati Crda To Acquire 20494 Acres In Seven Villages

Phase-2 Land Pooling: అమరావతి రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్‌ పెడుతూనే.. రెండో విడత భూ సేకరణపై దృష్టి సారించింది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్‌.. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతోన్న కేబినెట్‌ సమావేశంలో .. అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగంగా రెండో విడత ల్యాండ్ పూలింగ్ విధివిధానాలపై కీలక చర్చలు కొనసాగుతున్నాయి. రాజధాని పరిధిలో మరిన్ని గ్రామాలను సేకరణ ప్రదేశాలుగా గుర్తిస్తూ, భూ సమీకరణ చర్యలకు వేగం పెంచనుంది ప్రభుత్వం. రెండో విడత భూ సమీకరణలో భాగంగా పరిశీలించిన గ్రామాల విషయానికి వస్తే.. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి ఉన్నాయి.. ఈ గ్రామాల్లో భూ లభ్యత, రికార్డులు, యాజమాన్యం, అభ్యంతరాలు వంటి అంశాలపై అధికారులు నివేదికలు సమర్పించారు.

రెండో విడత భూ సమీకరణ వివరాలు:
వైకుంఠపురం – 3,361 ఎకరాలు
పెదమద్దూరు – 1,145 ఎకరాలు
ఎండ్రాయి – 2,166 ఎకరాలు
కర్లపూడి – 2,944 ఎకరాలు
వడ్డమాను – 1,913 ఎకరాలు
హరిశ్చంద్రపురం – 2,418 ఎకరాలు
పెదపరిమి – 6,513 ఎరాలు..

ఇలా మొత్తం 20,494 ఎకరాల భూమిని సేకరించనున్నారు.. అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూమితో కలిపి మొత్తం 20,494 ఎకరాల సేకరణ చేపట్టనున్నట్లు CRDA స్పష్టం చేసింది. త్వరలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అమరావతి రాజధానిలో మొత్తం భూ సమీకరణ లక్ష్యం మొదటి విడతలో రైతుల నుంచి 34,000 ఎకరాలు సమీకరణ కాగా.. రెండో విడత లక్ష్యం అదనంగా 16,000 ఎకరాలుగా ఉంది.. మొత్తం రైతుల నుంచి భూ సమీకరణ 50,000 ఎకరాలు కాగా.. అదనంగా ప్రభుత్వ భూమి 16,000 ఎకరాలు CRDAకి అప్పగించనున్నారు.. దీంతో అమరావతి రాజధాని నిర్మాణానికి మొత్తం 70,000 ఎకరాల భూభాగం సిద్ధమవుతోంది.

కేబినెట్‌ సమీక్షించిన మరిన్ని అంశాలు విషయానికి వస్తే.. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్‌లకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్.. అమలు విధానాలపై వివరణాత్మక చర్చ జరిగింది.. భూ రికార్డుల డిజిటలైజేషన్‌, భూ యజమానులకు డాక్యుమెంటేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. మొత్తంగా అమరావతి నిర్మాణ ప్రక్రియను మళ్లీ వేగవంతం చేస్తూ, రెండో విడత ల్యాండ్ పూలింగ్‌ను ప్రభుత్వం కీలక అడుగుగా చూస్తోంది. త్వరలో అధికారిక నోటిఫికేషన్ వెలువడుతుందని సమాచారం.