
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ ఇటీవల ఆ దేశంలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అవినీతి ఆరోపణలతో రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ను అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యమే హత్య చేసిందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. గత నాలుగు వారాలుగా ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు ఎవరిని అనుమతించకపోవడం ఈ వార్తలకు బలాన్ని చేకూరస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ చెల్లెళ్లతో సహా, ఖైబర్ ఫఖ్తుంఖ్వా సీఎంను కూడా అధికారులు అనుమతించడం లేదు.
Read Also: Jagga Reddy : రాహుల్ గాంధీది త్యాగాల కుటుంబం.. మాట్లాడే మీరు అర్హులు కాదు
ఇదిలా ఉంటే, తన తండ్రి ఆచూకీ గురించి ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసిం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని డెత్ సెల్లో ఉంచారని, ఆయన నుంచి ఎలాంటి కాల్స్ లేవని, ఆయనను కలిసేందుకు అనుమతించడం లేదని, ఆయన బతికి ఉన్నాడనే ఆధారాలు లేవని అన్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, ఇమ్రాన్ ఖాన్ సోదరీమణుల్ని జైలులోకి అనుమతించడం లేదు. ఇమ్రాన్ ఖాన్ బతికి ఉన్నాడా లేదా అనేది తెలుసుకునేందుకు ఆయన కుటుంబం అంతర్జాతీయ జోక్యాన్ని కోరుతోంది.
845 రోజులుగా ఇమ్రాన్ ఖాన్ను పాకిస్తాన్ ప్రభుత్వం జైలులో ఉంచింది. ఆయనకు ఏదైనా జరిగితే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం చట్టబద్ధంగా, నైతికంగా, అంతర్జాతీయంగా జవాబుదారీగా ఉంటుందని కాసిం అన్నారు. అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకుని ఆయన జీవించి ఉన్నాడనే రుజువు కోరాలని ఆయన కోరారు. దీనికి ముందు, ఇమ్రాన్ సోదరి నోరీన్ నియాజీ మాట్లాడుతూ.. పాకిస్తాన్లో చీకటి కాలం నడుస్తోందని విమర్శించారు. తన సోదరుడిని జైలులో కఠిన పరిస్థితుల్లో ఉంచారని, జైలు లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని ఆమె అన్నారు.