
PM Modi: నవ భారత్ ఎవరి ముందు తలొగ్గదని, ప్రజలను రక్షించడంలో వెనుకాడదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. శుక్రవారం ఉడిపిలో జరిగిన ‘‘లక్ష కంఠ గీత పారాయణం’’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఏడాది పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత, భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి ప్రస్తావించారు. గత ప్రభుత్వాలు ఉగ్రవాద దాడి జరిగితే, ఎలాంటి చర్యలు తీసుకునేవి కావని, కానీ న్యూ ఇండియా తన ప్రజల్ని రక్షించడంలో వెనకడాదని చెప్పారు. శాంతి, సత్యం కోసం పనిచేయాలని, దారుణాలకు పాల్పడే వారిని అణిచివేయాలని గీత మనకు బోధిస్తుందని ప్రధాని అన్నారు.
Read Also: Imran Khan: “ఇమ్రాన్ ఖాన్ బతికి ఉన్నాడనే రుజువు లేదు”.. కుమారుడి సంచలన వ్యాఖ్యలు..
ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై ఖచ్చితమైన దాడులు జరిపామని, ప్రభుత్వం చూపిన దృఢ సంకల్పాన్ని దేశం చూసిందని ఆయన అన్నారు. మిషన్ సుదర్శన చక్ర ద్వారా దేశంలోని కీలక ప్రదేశాలు, పారిశ్రామిక, ప్రజా ప్రదేశాల చుట్టూ భద్రతను అందిస్తామని వెల్లడించారు. ఉడిపిలోని పెజావర మఠానికి చెందిన స్వామి విశ్వేశ తీర్థను ప్రధాని మోడీ ప్రశంసించారు. రామ జన్మభూమి ఉద్యమంలో ఆయన పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. ఆలయ ఉద్యమానికి ఆయన మార్గదర్శకత్వం ఇటీవల అయోధ్యలో రామాలయంలో జెండా ఎగురవేయడానికి దారి తీసిందని ఆయన అన్నారు.