
Kishan Reddy : హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించే పనులను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద ఈ స్టేషన్ అభివృద్ధి వేగవంతంగా కొనసాగుతుండగా, మొత్తం 35 కోట్ల రూపాయలతో అత్యాధునిక సౌకర్యాలను కల్పించే పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. సాంకేతిక ప్రగతికి కేంద్ర బిందువుగా ఉన్న హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు, రోజువారీ ప్రయాణికులు, టూరిజం రంగానికి చెందిన వారు ఉపయోగించే ఈ స్టేషన్‌ను ఆధునిక ప్రమాణాలతో తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవిలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో రైల్వే అభివృద్ధి ఎన్నడూ లేనంత వేగంగా సాగుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రైల్వే లైన్ల నిర్మాణం నుంచి స్టేషన్ల ఆధునీకరణ వరకు రాష్ట్రంలో ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ జరుగుతుండటం ఇదే మొదటి సారేనని చెప్పారు. ఇటీవలే చర్లపల్లి న్యూ టర్మినల్‌ను ప్రధాని ప్రారంభించగా, హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి టర్మినల్స్‌కు తోడుగా ఇది నాలుగో ప్రధాన టర్మినల్‌గా సేవలు అందిస్తోంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను 720 కోట్లతో, కాచిగూడ స్టేషన్‌ను 424 కోట్లతో ఆధునీకరించే పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇదే క్రమంలో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో ఫస్ట్ ఫేజ్‌గా 26 కోట్లతో కొత్త భవనాలు, అప్రోచ్ రోడ్లు, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని, రెండో దశలో మరో 10 కోట్లతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం రోజుకు 62 సబర్బన్, ఎంఎంటీఎస్ రైళ్లు ఈ స్టేషన్ వద్ద ఆగుతుండగా, సుమారు 5,400 మంది ప్రయాణికులు సేవలు పొందుతున్నారని తెలిపారు. ఆధునీకరణ అనంతరం ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
స్టేషన్‌లో నాలుగు లిఫ్టులు, రెండు ఎస్కలేటర్లు, ఆధునిక వెయిటింగ్ రూమ్స్, దివ్యాంగులకు అనుకూలంగా ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ పనులన్నీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరికి ఫస్ట్ ఫేజ్ — వెస్ట్ సైడ్ భాగం పూర్తయ్యేలా లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. దసరా సమయంలో ముంబై, కాజీపేట, విశాఖపట్నం రూట్లలో నడిచే రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ సిటీలో ఆపినట్లు, అలాగే సంక్రాంతి సందర్భంగా 16 స్పెషల్ ట్రైన్లు కూడా ఇక్కడ ఆగనున్నట్లు తెలిపారు. మరిన్ని రైళ్లు ఇక్కడ ఆపేందుకు ట్రయల్ బేసిస్‌లో నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు.
తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లతో పాటు కొమురవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తిగా ముగిసిందని, త్వరలో భక్తుల కోసం ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్‌ను యాదాద్రి వరకు పొడిగించే ప్రతిపాదనపై ఇప్పటికే టెండర్లు జరిగుతున్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రైల్వే లైన్ల ఎలక్ట్రిఫికేషన్ 100 శాతం పూర్తయిందని, వైఫైతో సహా అనేక ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. కాజీపేటలో నిర్మాణం జరుగుతున్న రైల్వే మల్టీ మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ (RMU) పనులను రేపు పరిశీలించనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ రైల్వే మౌలిక వసతులను అద్భుతంగా తీర్చిదిద్ది, కొత్త రైల్వే లైన్ల నిర్మాణంతో మరింత అభివృద్ధి సాధించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, బడ్జెట్‌ను ముందు ఊహించని స్థాయిలో భారీగా కేటాయిస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.