
Trinamool Congress: పశ్చిమ బెంగాల్ రాజకీయాలను ‘‘బాబ్రీ మసీదు’’ వివాదం నిప్పు రాజేసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. డిసెంబర్ 6 ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ మసీదు నమూనాతో మసీదు నిర్మిస్తామని ప్రకటించారు. ఇది బెంగాల్లో పెద్ద వివాదంగా మారింది. అయితే, ఎమ్మెల్యే మాటలతో తమకు సంబంధం లేదని టీఎంసీ చెప్పింది. ఈ వారం బెల్దంగా ప్రాంతంలో బాబ్రీ మసీదు నిర్మిస్తామని చెబుతూ పోస్టర్లు కనిపించాయి.
Read Also: Akhanda 2: పవర్ఫుల్ యాక్షన్‌తో ‘అఖండ 2 తాండవం’ కొత్త టీజర్..
డిసెంబర్ 6 అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు. అదే రోజున ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ముర్షిదాబాద్ జిల్లాలో మసీదు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే ప్రకటించడం ఉద్రిక్తతల్ని పెంచింది. మసీదు నిర్మాణం తన మతపరమైన హక్కు, స్థానికుల డిమాండ్ అని కబీర్ చెప్పారు. అయితే, ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యే బాబ్రీ మసీదు అంశాన్ని తీసుకురావడం టీఎంసీని ఇబ్బందుల్లోకి నెట్టింది. దీంతోనే, ఈ వ్యాఖ్యలకు టీఎంసీ దూరంగా ఉంది.
బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ చీఫ్ విప్ నిర్మల్ ఘోష్ మాట్లాడుతూ.. పార్టీకి హుమాయున్ కబీర్‌తో సంబంధం లేదు, ఆయన వ్యాఖ్యలు, చర్యలతో పార్టీకి సంబంధం లేదు, అతడు ఏం చెప్పినా అది ఆయన వ్యక్తిగతం అని అన్నారు. కబీర్‌పై టీఎంసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందని మరో సీనియర్ నేత చెప్పారు. కబీర్ పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలకు దిగినప్పటికీ టీఎంసీ ఇప్పటికీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. ఇదిలా ఉంటే, దీనిపై బీజేపీ స్పందించింది. ఎన్నికల్లో ఓట్ల కోసమే టీఎంసీ ఇలా చేస్తోందని బీజేపీ ఆరోపించింది.