
30 ఏళ్లు దాటిన తర్వాత మన శరీరంలో కొన్ని చిన్న చిన్న మార్పులు సహజంగానే ప్రారంభమవుతాయి. చాలా మంది ఈ వయసుకి వచ్చేసరికి “అంతా అయిపోయింది” అనుకునే భయం పడుతుంటారు. కానీ వయస్సుతో వచ్చే మార్పులు ఒక్క రోజులో జరిగేవి కావు — అవి సంవత్సరాల పాటు నెమ్మదిగా ఏర్పడే సహజ ప్రక్రియ.
30+ ఏళ్ల వయసులో సాధారణంగా కనిపించే లక్షణాలు:
శక్తి మామూలు కంటే తగ్గిపోవడం. చిన్న పనులకే అలసట రావడం. చర్మంపై ముడతలు పడడం. జుట్టు రాలడం లేదా తెల్లబడడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పులు 60 ఏళ్లు వచ్చే సరికి మరింత స్పష్టంగా కనిపిస్తాయి. వృద్ధాప్యంలో శక్తి తగ్గడం, చూపు-వినికిడి మందగించడం, జుట్టు తెల్లబడడం వంటివి ప్రతి మనిషిలో సహజంగా జరుగుతాయి. ఇవన్నీ భయపడాల్సిన విషయాలు కావని నిపుణులు చెబుతున్నారు. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యమైన జీవనశైలి పాటిస్తే ఈ మార్పులను నెమ్మదించడంతో పాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
వయస్సు పెరిగేకొద్దీ కనిపించే మరికొన్ని సహజ లక్షణాలు:
కీళ్ల నొప్పులు, నిద్ర తగ్గడం, చిన్న విషయాలు మరచిపోవడం, శరీరం త్వరగా జబ్బు పడడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇవి ప్రతి జీవిలో తప్పనిసరిగా జరిగే సహజ శారీరక మార్పులు. వృద్ధాప్యాన్ని ఆపడం సాధ్యం కాకపోయినా వయసు గురించి ఆలోచిస్తూ భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
జీవితం చిన్నది… వయసు పెరుగుతున్నందుకు భయపడకుండా, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా గడపడం నేర్చుకోవాలి. సరైన జీవనశైలితో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది.