
TTD Adulterated Ghee Case: తిరుమల తిరుపతి దేవస్థానంలో బాధ్యతాయుతమైన జనరల్ మేనేజర్ పోస్టులో ఉన్న సుబ్రహ్మణ్యం (ఏ29) నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సిట్ స్పష్టం చేసింది. ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రహ్మణ్యం 2017 జులై 6 నుంచి 2018 మే 17 వరకు ఒకసారి కొనుగోళ్ల విభాగం జీఎంగా పనిచేశారు. 2020 మే 13 నుంచి 2023 మే 1 వరకు మరోసారి ఇలా రెండుసార్లు జీఎంగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం టీటీడీలో ఈఈ గా ఉన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి నెయ్యి సరఫరా చేసే అర్హత లేని బోలేబాబా, వైష్ణవి డెయిరీ, మాల్గంగా సంస్థల ప్రతినిధులతో సుబ్రహ్మణ్యం కుమ్మక్కై రూ.16,700 విలువ చేసే వెండి ప్లేటు, రూ.50 వేల ఖరీదైన శాంసంగ్ ఫోన్, రూ.3.50 లక్షల నగదు.. 2021 జులై నుంచి 2023 నవంబర్ వరకు వేర్వేరు తేదీల్లో వస్తు, నగదు రూపంలో లంచాలు తీసుకున్నారని సిట్ విచారణలో తేలింది. డెయిరీల ప్లాంట్లను తనిఖీ చేయకుండానే వాటికి అనుకూలంగా సుబ్రహ్మణ్యం సభ్యుడిగా ఉన్న సాంకేతిక కమిటీ నివేదిక ఇవ్వడంతో కాంట్రాక్టు దక్కిందని నిర్ధారించారు. వైష్ణవి డెయిరీ, ప్రీమియర్ అగ్రిపుడ్స్, భోలేబాబా సంస్థ ట్యాంకర్లు, టిన్నుల ద్వారా సరఫరా చేస్తోన్న నెయ్యి నమూనాలను పరీక్షించగా వెజిటేబుల్ ఆయిల్స్ కలిపారని మైసూరులోని సీఎప్ టీఆర్ఐ ల్యాబ్ తేల్చినా.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా సుబ్రహ్మణ్యం ఉద్దేశపూర్వకంగా నివేదికను దాచారని సిట్ పేర్కొంది. తిరుమల లడ్డూకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో గురువారం అరెస్టైన కొనుగోళ్ల విభాగం జీఎం సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్టు శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
Read Also: Rashi Khanna: నా కంఫర్ట్ జోన్ దాటి దిగజారిపోయే పాత్రలు నాకొద్దు..
కల్తీ నెయ్యి వ్యవహారంలో భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ కీలక సూత్రధారులు. ఇందులో తయారుచేసిన నెయ్యినే మిగతా డెయిరీలకూ పంపి తిరుమలకు సరఫరా అయింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్నకు భోలేబాబా డైరెక్టర్లు కమీషన్ ఇవ్వకపోవడంతో నెయ్యిలో కల్తీ జరుగుతోందని, డెయిరీకి అంత సామర్థ్యం లేదని పిటిషన్ ఇచ్చారు. ఇదే సమయంలో 2022 మే నెలలో 24.50 లక్షల కిలోల అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యిని జాతీయ స్థాయిలోని డెయిరీల నుంచి కొనుగోలు చేస్తామని టీటీడీ టెండర్లు పిలిచింది. భోలేబాబా డెయిరీ కూడా బిడ్ దాఖలు చేసింది. దాంతో 2022 జూన్ 6న ఆ కంపెనీ ప్లాంటును తనిఖీ చేయడానికి సుబ్రహ్మణ్యం సభ్యుడిగా ఉన్న సాంకేతిక కమిటీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్క్ వెళ్లింది. ఈ సమయంలో చిన్న అప్పన్న పదేపదే ఆయనకు ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చారు. టీటీడీకి ఇచ్చిన నివేదికలో భోలేబాబా డెయిరీకి టెండర్లలో పాల్గొనే సాంకేతిక అర్హత లేదని, నెయ్యి తయారికి సరైన ప్రమాణాలు పాటించడంలేదని కమిటీ నివేదిక ఇచ్చింది. స్వయంగా ప్లాంటుకు వెళ్లిన జీఎం సుబ్రహ్మణ్యమే అవకతకలను గుర్తించినందున నెయ్యి సరఫరా కాంట్రాక్టును నిలుపుదల చేయాల్సి ఉన్నప్పటికీ.. ఆ తర్వాత కూడా అదే డెయిరీకి సరఫరా ఆర్డర్లు ఇవ్వడం గమనార్హం. ఒకసారి 9,450 కిలోలు (కిలోకు రూ.329.32 చొప్పున), మరోసారి 1,07,625 కేజీల (కేజీ రూ.329 చొప్పున) నెయ్యి పంపాలని ఆదేశాలు ఇచ్చారు. 2022 అక్టోబర్ వరకు భోలేబాబా సంస్థ సరఫరా చేసింది. అర్హత లేదని చెప్పిన వ్యక్తే ఆర్డర్లు ఇవ్వడంపై సిట్ విస్మయం వ్యక్తం చేసింది.
ఇక, 2021, 2022 నెయ్యి సరఫరాకు టీటీడీ టెండర్లు ఆహ్వానించింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని భోలే బాబా డెయిరీ, తిరుపతి జిల్లా పునబాకలోని వైష్ణవి డెయిరీ, మహారాష్ట్రలోని మాల్గంగా డెయిరీలు ఆసక్తి చూపాయి. ఇందులో వైష్ణవి, మాల్గంగా కంపెనీలతో భోలాబాబా డైరెక్టర్లే టెండర్లు వేయించారు. సుబ్రహ్మణ్యం సభ్యుడిగా ఉన్న సాంకేతిక కమిటీ ఆ డెయిరీల ప్లాంట్లను పరిశీలించకుండానే వాటికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయని నివేదిక ఇచ్చింది. దాంతో ఫైనాన్సిషియల్ బిడ్‌కు అనుమతి లభించింది. ఎల్1, ఎల్2గా నిలిచిన డెయిరీలకు కాంట్రాక్టు దక్కింది. టెండరు దాఖలు సమయంలో మూడు డెయిరీలు తప్పుడు పత్రాలు సమర్పించినా వాటిని పక్కన పెట్టకుండా సుబ్రహ్మణ్యం ధ్రువీకరించారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా నే చేశారని సిట్ విచారణలో తేలింది. తద్వారా తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా అయి కోట్లాది మంది హిందువుల మనోభావాలు చెబ్బతిన్నాయి. డెయిరీలకు మాత్రం కోట్ల రూపాయల్లో లాభం వచ్చింది. ముఖ్యంగా కొనుగోళ్ల విభాగం జీఎం సుబ్రహ్మణ్యం భోలేబాబా డెయిరీ డైరెక్టర్ పొమిల్ జైన్, కమీషన్ ఏజెంట్ పీపీ శ్రీనివాసన్ నుంచి వస్తు, డబ్బు రూపంలో లంచాలు తీసుకున్నారని సిట్ తేల్చింది. 2021 జులై 23న వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్కాంత్ చావ్దా తరపున కమీషన్ ఏజెంట్‌గా ఉన్న పీపీ శ్రీనివాసన్ నుంచి రూ.16,700 విలువైన వెండి ప్లేటును అనుచిత లాభం రూపంలో స్వీకరించారు. 2021 డిసెంబరు 22, 23న భోలేబాబా ఓరోగానిక్ డెయిరీని తనిఖీ చేసే సమయంలో పోమిల్ జైన్ నుంచి రూ.50 వేల విలువైన శాంసంగ్ ఫోన్‌ను తీసుకున్నారు. ఆ తర్వాతే భోలేబాబాకు నెయ్యి టెండర్ పొందే అర్హత లేకున్నా ఇతర సభ్యులతో కలిసి అనుకూలంగా నివేదిక ఇచ్చారు. 2022 మార్చి నుంచి 2023 ఏప్రిల్ వరకు వివిధ తేదీలలో భోలేబాబా డెయిరీకీ కమీషన్ ఏజెంట్‌గా ఉన్న పీపీ శ్రీనివాసన్ ద్వారా రూ.3.50 లక్షలు లంచం డిమాండ్ చేయగా ఆయన ఈ మొత్తం ఇచ్చారు. ప్రతిఫలంగా భోలేబాబా సంస్థతోపాటు అనుబంధంగా ఉన్న వైష్ణవి, మాల్గంగా సంస్థలకు అనుకూలంగా వ్యవహరించారు.. 2023 నవంబరు 8న రూ.5 వేల విలువైన 50 గ్రాముల వెండి నాణేన్ని శ్రీనివాసన్ నుంచి తీసుకున్నారు.
ఇక, 2022 మే 20న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాలతో వైష్ణవి డెయిరీ, ప్రీమియర్ అగ్రిఫుడ్స్, భోలేబాబా సంస్థ ట్యాంకర్లు, టిన్నుల్లో సరఫరా చేసే నెయ్యి నమూనాలను బయటి ల్యాబ్‌కు పంపాలని సుబ్రహ్మణ్యం గిడ్డంగి విభాగ అధికారులకు మెమో ఇచ్చారు. 2022 ఆగస్టు 15న అది బీటా సిటోస్టెరాల్ పాజిటివ్ ఉందని, తద్వారా కల్తీ జరిగిందని ఆయనకు ఈ- మెయిల్ ద్వారా సమాచారం వచ్చింది. పై అధికారులకు సమర్పించకుండా వీటిని ఆయన దాచిపెట్టారు. యథావిధిగా సరఫరాను కొనసాగించారు. ఇక 2022 మే 28న డెయిరీ నిపుణుడైన బి. సురేంద్రనాథ్ టీటీడీ ఈవోకు మెయిల్ పంపారు. బీటా సిటోస్టెరాల్ మరియు ఎఫ్ఎస్ఎస్ఆర్ (ఆహార భద్రత మరియు ప్రమాణాల నియంత్రణ) ప్రమాణాలు ఎంత ఉండాలో నెయ్యి టెండరు నిబంధనల్లో చేర్చాలని సూచించారు. భవిష్యత్తులో పిలిచే టెండర్లతోపాటు 2022 మే 10న ట్యాంకర్ల ద్వారా, 2022 మే 11న టిన్నుల ద్వారా నెయ్యి సరఫరాకు సాంకేతికంగా అర్హత పొందిన సంస్థలకూ వీటిని వర్తింపజేయాలని సిఫార్సు చేయగా ఈవో అనుమతించారు. ఈ టెండర్లలో ఎల్1, ఎల్2గా ఉన్న ఆల్ఫా డెయిరీ, ప్రీమియర్ అగ్రిఫుడ్స్ సంస్థలు 2022 ఆగస్టులో ఎస్ఎస్ఎస్ఆర్ ప్రమాణాల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరగా సుబ్రహ్మణ్యం దురుద్దేశంతో ఈవోకు ఓ నోట్ పంపారు. ప్రీమియర్ అగ్రిఫుడ్స్ సరఫరా చేసేది కల్తీ నెయ్యి అని తెలిసిన తర్వాత కూడా సుబ్రహ్మణ్యం ఈ విధంగా నిబంధనలు సవరించారని సిట్ దర్యాప్తులో తేలింది.