
అత్యంత గా కనిపించే క్యాన్సర్లలో కడుపు క్యాన్సర్ (గ్యాస్ట్రిక్ క్యాన్సర్) ఒకటి. భారతదేశంలో ఇది ఏడవ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా నమోదవుతోంది. ప్రతి సంవత్సరం దాదాపు 64,000 కేసులు గుర్తించబడుతున్నాయి. ప్రమాదకరమైన విషయం ఏమిటంటే – ప్రారంభ దశలో ఈ క్యాన్సర్ పెద్దగా లక్షణాలు చూపించదు. అందుకే చాలా మంది గుర్తించే సమయానికి ఇది ముదిరిపోయి ఉంటుంది. రోజువారీ అలవాట్లే కడుపు క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం, పొగబెట్టిన లేదా కాల్చిన వంటకాలు, ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్ తరచూ తీసుకోవడం రిస్క్‌ను పెంచుతుంది. తాజా పండ్లు, కూరగాయలు తక్కువగా తీసుకోవడం వల్ల కణాలు రిపేర్ అయ్యే సామర్థ్యం తగ్గిపోతుంది.
H. pylori ఇన్ఫెక్షన్ :
జీర్ణాశయంలో కనిపించే హెలీకోబ్యాక్టర్ పైలోరి (H. pylori) బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌కు దారితీసే అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి. ఇది కడుపు గోడను నిరంతరం బాధిస్తూ ఇన్‌ఫ్లమేషన్ (మంట) కలిగిస్తుంది. దీన్ని సకాలంలో చికిత్స చేయకపోతే ఈ ఇన్‌ఫ్లమేషన్ అల్సర్లుగా మారి, సంవత్సరాలకుపైగా కొనసాగితే క్యాన్సర్‌గా అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే H. pylori ఇన్ఫెక్షన్ గుర్తించిన వెంటనే సరైన యాంటీబయోటిక్ చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. స్మోకింగ్ కడుపు కణాలను తీవ్రంగా దెబ్బతీసి రిస్క్‌ను రెట్టింపు చేస్తుంది. అదేవిధంగా అధిక మోతాదులో మద్యం సేవించడం కూడా ప్రమాదాన్ని పెంచుతుంది. ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, వంశపారంపర్య రిస్క్ కూడా ఈ క్యాన్సర్‌కు కారణం అవుతుంది. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్‌లో ఎవరికైనా కడుపు క్యాన్సర్ ఉంటే మిగిలిన వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే CDH1 వంటి జన్యువుల్లో మార్పులు ఉన్నవారికి చిన్న వయస్సులోనే క్యాన్సర్ వచ్చే అవకాశముంది.
స్టమక్ క్యాన్సర్ లక్షణాలు :
ప్రారంభ దశలో లక్షణాలు నిశ్శబ్దంగా ఉంటాయి అజీర్ణం, గ్యాస్, కడుపులో మంట, కొద్దిగా తిన్నా నిండిన భావన వంటి చిన్న సమస్యలుగా కనిపిస్తాయి. మరింత ముదిరితే బరువు తగ్గడం, వాంతులు, మింగడంలో ఇబ్బంది, నల్ల మలం, అలసట, అలాగే పొత్తికడుపులో నీరు చేరడం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇవి రెండు వారాలకు పైగా కొనసాగితే వెంటనే వైద్యుని సంప్రదించడం అత్యవసరం.
చికిత్సా విధానాలు:
క్యాన్సర్ దశ పై ఆధారపడి చికిత్స మారుతుంది. ప్రారంభ దశల్లో సర్జరీ అత్యంత ప్రభావవంతం. రోబోటిక్ లేదా లాపరోస్కోపిక్ పద్ధతులు కూడా ఉపయోగిస్తారు. ముదిరిన దశలో కెమోథెరపీ, రేడియేషన్ థెరపీ అవసరం అవుతుంది. అడ్వాన్స్‌డ్ కేసుల్లో HIPEC వంటి ప్రత్యేక చికిత్సా విధానాలు కూడా ఉంటాయి. టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఆధునిక పద్ధతులు తక్కువ దుష్ప్రభావాలతో మంచి ఫలితాలను ఇస్తాయి.
నివారణ మరియు జాగ్రత్తలు :
1.అన్ని కేసులను నివారించడం సాధ్యం కాకపోయినా, సరైన అలవాట్లతో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
2. తాజా పండ్లు, కూరగాయలు, పౌష్టికాహారం తీసుకోవడం
3. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించడం
4. పొగతాగడం మానేయడం
5. మద్యం నియంత్రణ
6. ఆరోగ్యకరమైన బరువు నిలుపుకోవడం
ఈ జాగ్రతలు పాటిస్తే స్టమక్ క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసే అవకాశం చాలా ఎక్కువ. అందుకే ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యము.