
ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వచ్చిన ‘లాల్ సలాం’ చిత్రాన్ని తాజాగా ఇఫి (IFFI) 2025 వేడుకల్లో ప్రత్యేక ప్రదర్శన గా చూపించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్య, సినిమా ప్రయాణం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసే సమయంలో ఎదురైన అనుభవాలు, సవాళ్లను తలచుకుంటూ, ముఖ్యంగా తన తండ్రి రజనీకాంత్ ఇచ్చిన ప్రోత్సాహానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
Also Read : Renu Desai : నన్ను వదిన అని పిలవద్దు.. జానీ మాస్టర్‌కి రేణు దేశాయ్ సీరియస్ వార్నింగ్
“‘లాల్ సలాం’ షూటింగ్ రోజులు నాకు ఇంకా స్పష్టంగా గుర్తున్నాయి. ఆ రోజుల్లో అనుభవించిన ప్రతి క్షణం ప్రత్యేకమైనదే. దర్శకురాలిగా ఈ కథను తెర పైకి తీసుకురావడం ఒక పెద్ద బాధ్యత. ఈ ప్రయాణంలో ఎన్నో సమస్యలు ఎదురైనా, నాన్న ఇచ్చిన ధైర్యం నాకు అండగా నిలిచింది. కేవలం కుమార్తెగా కాదు, ఒక దర్శకురాలిగా కూడా ఆయనకెప్పటికీ రుణపడి ఉంటా. రజనీకాంత్ వంటి లెజెండరీ నటుడిని నేను స్వయంగా దర్శకత్వం వహించడం నా జీవితం లో ఒక కల లాంటిది. ఆ అవకాశం రావడం నాకు దేవుడిచ్చిన వరం లాంటిది. ఈ చిత్రం ద్వారా నా కెరీర్‌లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఈ ప్రయాణంలో నన్ను నమ్మి, నన్ను ముందుకు నడిపిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు.
‘లాల్ సలామ్’ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించగా, భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. జీవితా రాజశేఖర్ కూడా కీలక అతిథి పాత్రలో నటించారు. క్రికెట్ నేపథ్యంలో సాగే యాక్షన్-డ్రామా కథాంశం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. భారీ అంచనాలు ఉన్నప్పటికీ, విడుదల సమయంలో మాత్రం ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ, ఈ చిత్రాన్ని దర్శకురాలిగా తన అత్యంత వ్యక్తిగత, హృదయపూర్వక ప్రయాణంగా భావిస్తున్నానని ఐశ్వర్య చెప్పారు.