Maoists in Andhra Pradesh: ఏపీలో మావోయిస్టుల కలకలం.. ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల కూంబింగ్..

Suspicion Of Maoist Movement Near Erramala Hills Chhattisgarh Special Police Launch Search Operation In Nandyal

Maoists in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మవోయిస్టుల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి.. మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా కీలక నేతల ఎన్‌కౌంటర్‌.. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మావోయిస్టుల అరెస్ట్‌లు చర్చగా మారగా.. ఇప్పుడు మరోసారి ఏపీలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి.. నంద్యాల జిల్లాలో అకస్మాత్తుగా సెక్యూరిటీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కొలిమిగుండ్ల మండలంలోని ఎర్రమల కొండ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు భారీ స్థాయిలో కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించడం స్థానికంగా కలకలం రేపుతోంది. సమాచారం ప్రకారం, ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న ‘కగార్ ఆపరేషన్‌’ నేపథ్యంలో అక్కడి అడవుల నుంచి కొంతమంది మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వైపు జారిపోయినట్లు ఇంటెలిజెన్స్ సమాచారం రాగా, రెండు ప్రత్యేక బృందాలు నంద్యాల జిల్లాకు చేరుకున్నాయి.

Read Also: Aishwarya Rajinikanth : ఆయన సహాయానికి ఎప్పటికీ రుణపడి ఉంటా..

ఎర్రమల కొండ పరిధిలోని ఈ ప్రాంతాల్లో గాలింపు జరుగుతోంది.. నేలబిళం, ఓబులేసు కోన, ఎర్రకోన, బెలుం గుహల పరిసరాల్లో సుమారు 20 మందికిపైగా సశస్త్ర బలగాలు రెండు ప్రత్యేక వాహనాల్లో ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న పలు సిమెంట్ పరిశ్రమల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, బీహార్‌కు చెందిన కూలీలు పనిచేస్తుండడంతో, వారిని కూడా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. పోలీసుల అనుమానం ప్రకారం.. మావోయిస్టులు ఈ కార్మికుల మధ్య మిళితం కావచ్చని భావిస్తున్నారు. ఈ ప్రాంతం గతంలో మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచింది. 10 ఏళ్ల క్రితం ఇదే పరిసరాల్లో జనశక్తి నక్సల్స్ & పోలీసుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్ జిల్లా వ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. అందువల్ల ఈ ప్రాంతాన్ని మళ్లీ షెల్టర్ జోన్‌గా మావోయిస్టులు ఉపయోగించే అవకాశం ఉందనే అనుమానంతో సెక్యూరిటీ వ్యవస్థ అప్రమత్తమైంది. ఈ చర్యలతో గ్రామాల్లో టెన్షన్ నెలకొంది. అడవుల్లో హెలికాప్టర్లు కనిపించటం, పోలీసులు గ్రామాల్లో గస్తీ ఏర్పాటు చేయడంతో ప్రజల్లో భయాందోళనలు కనిపిస్తున్నాయి.