
Amaravati Farmers Issues: రాజధాని పరిధిలోని రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వేగం పెంచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మునిసిపల్, నగరాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సమస్యలు, భూవిభజన, ఆరోగ్య పథకాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.
Read Also: Avian Influenza :దేశంలోకి కొత్త రకం వైరస్..ఏవియన్ ఇన్ఫ్లుఎంజా గురించి తెలుసా..
ఇక, సమావేశం అనంతరం మాట్లాడిన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. మొత్తం 1286 ప్లాట్లకు వీధి పోటు (ప్లానింగ్ & అలైన్‌మెంట్) సమస్యలు ఉన్నాయని తెలిపారు. వాస్తు పరంగా 156 మంది రైతులు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. వాస్తు సమస్యలతో బాధపడుతున్న రైతులకు వేరే ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించేందుకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. రైతులకు సంబంధించిన హెల్త్ కార్డులు, పెన్షన్లు, సేవల నిలిపివేత వంటి సమస్యలు ఒక నెలలో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు, లంక భూములు మరియు అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అసైన్డ్ ల్యాండ్‌ను మిగిలిన భూముల నుంచి వేరుచేసి, కేబినెట్‌లో చర్చిస్తాం అని స్పష్టం చేశారు.
మరోవైపు మంత్రి నారాయణ మాట్లాడుతూ.. అమరావతి గ్రామాల్లోని జరీబు-నాన్ జరీబు, గ్రామకంఠం భూముల సమస్యలపై సమగ్ర పరిశీలన చేస్తున్నాం. వచ్చే కేబినెట్ సమావేశంలో అసైన్డ్ ల్యాండ్స్ మరియు లంక భూములపై నిర్ణయం తీసుకునే అవకాశముంది అన్నారు. అలాగే అమరావతి రాజధాని గ్రామాల్లో HD లైన్లు, రోడ్లు, నీటి వసతులు, ఇతర మౌలిక సౌకర్యాలపై ప్రభుత్వం ప్రాధాన్యతతో పనిచేస్తుందని తెలిపారు. రైతుల అభ్యర్థనలు, పెండింగ్ అంశాలు, భూవిభజన సమస్యలు తరచుగా సమీక్షించేందుకు ప్రతి రెండు వారాలకు రైతులతో సమావేశమై వారి సమస్యలు వింటాము అని త్రిసభ్య కమిటీ ప్రకటించింది.