Delhi Car Blast: 3 పెళ్లిళ్లు.. ఇద్దరు పిల్లలు.. వెలుగులోకి షాహీన్ ప్రేమకథ!

Dr Shaheena Love Story

ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. అల్‌-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఎంత పెద్ద కుట్ర జరిగిందో దర్యాప్తు అధికారులు తేల్చారు. టెర్రర్ మాడ్యూల్‌లో ఉన్న అనేక మంది ఉగ్రవాదులను అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్ర డాక్టర్లు ఉమర్, షాహీన్, ముజమ్మిల్ దేశ వ్యాప్త పేలుళ్లకు కుట్ర పన్నినట్లుగా తేల్చారు.

షాహీన్ ప్రేమకథ..
తాజాగా షాహీన్(46) ప్రేమకథ వెలుగులోకి వచ్చాయి. ఇటీవల విచారణలో ముజమ్మిల్ కీలక విషయాలు వెల్లడించారు. డాక్టర్ షాహీనా తన లవర్ కాదని.. తన భార్య అని చెప్పుకొచ్చాడు. వీరిద్దరికి 2023, సెప్టెంబర్‌లో వివాహం అయింది. అల్‌-ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలోనే పెళ్లి జరిగింది. ముజమ్మిల్‌ను షాహీనా పెళ్లి చేసుకోక ముందే ఆమెకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. తాజాగా ఆమె మొదటి భర్త డాక్టర్ జాఫర్ హయత్‌ వెల్లడించాడు.

షాహీనా 2003లో కంటి వైద్యుడు జాఫర్ హయత్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ బంధం ఎంత కాలం నిలవలేదు. భార్యాభర్తల మధ్య విభేదాలు కారణంగా 2012లో విడాకులు మంజూరయ్యాయి. వృత్తిపరమైన ఒత్తిడి, కెరీర్, విదేశాలకు వెళ్లాలనే కోరిక కారణంగా ఆ దంపతులకు విడాకులు మంజూరయ్యాయి. అయితే ఆమె మనసులో ఏముందో.. ఏమో తెలియదు గానీ.. ఎప్పుడూ తమ మధ్య వివాదం గానీ.. గొడవలు గానీ లేవని డాక్టర్ హయత్ తెలిపాడు. తనను.. పిల్లల్ని బాగానే చూసుకునేదని చెప్పుకొచ్చాడు. పెళ్లి సమయంలో తప్ప ఆమె ఎప్పుడూ బురఖా ధరించలేదని హయత్ పేర్కొన్నాడు. మంచి జీవితం కోసం ఆస్ట్రేలియా లేదా యూరప్‌లో స్థిరపడాలని మాత్రం ఒకసారి అన్నట్లుగా తెలిపాడు. అయితే పిల్లలు, బంధువుల కోసం తాను వద్దని చెప్పినట్లుగా వెల్లడించాడు.

ఇక విడాకుల తర్వాత షాహీనా ఒంటరిగానే ఉంది. గణేష్ శంకర్ విద్యార్థి మెమోరియల్ (GSVM) మెడికల్ కాలేజీ నుంచి అకస్మాత్తుగా వైదొలిగింది. ఎటువంటి నోటీసు లేకుండా కాలేజీకి హాజరు కావడం మానేసింది. ఇక ఎనిమిది సంవత్సరాలుగా ఎవరికీ తెలియకుండానే ఉండిపోయింది. ఈ క్రమంలోనే షాహీనా రెండో పెళ్లి చేసుకుంది. ఘజియాబాద్‌లో వస్త్ర వ్యాపారం నడుపుతున్న వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ ఈ వివాహం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు.

ఇక షాహీనా రెండో పెళ్లి కూడా పెటాకులు అవ్వడంతో హర్యానాలోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో సీనియర్ డాక్టర్ అయిన ముజమ్మిల్ పరిచయం అయ్యాడు. దీంతో 2023, సెప్టెంబర్‌లో వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. ఒకే కళాశాలలో పని చేయడం, రోజువారీ సమావేశాలతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగి పెళ్లికి దారి తీసింది. ఈ క్రమంలోనే ఇద్దరూ కూడా ఉగ్రవాదం వైపు అడుగులు పడ్డాయి. జైషే మహమ్మద్ మహిళా విభాగానికి భారత్‌లో షాహీన్ నాయకత్వం వహించింది. అనేక మందిని ఉగ్రవాదం వైపు ఉరికొల్పింది. ఇలా డాక్టర్లు ఉమర్, మజమ్మిల్, షాహీనా కుట్ర పన్నారు. అయితే నవంబర్ 10న ఉమర్ కారులో వెళ్తుండగా సడన్‌గా బ్లాస్ట్ అయింది. ఈ పేలుడులో 15 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. ఇక అధికారులు రంగంలోకి దిగిన తర్వాత ఈ కుట్ర కోణాలు బయటపడ్డాయి.