
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్..
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రారంభంలో ఫిర్యాదు చేసిన అధికారుల పేర్లు కూడా ఇప్పుడు నిందితుల జాబితాలో చేరాయి. ఈ సందర్భంగా సిట్ (SIT) మరో మెమో దాఖలు చేస్తూ మొత్తం 11 మందిని అదనంగా నిందితులుగా నమోదు చేసింది. అయితే, ఈస్ట్ పీఎస్‌లో కల్తీ నెయ్యి జరిగిందని ఫిర్యాదు చేసిన అప్పటి జీఎం మురళీకృష్ణపై కూడా కేసు నమోదు కావడం పెద్ద చర్చగా మారింది. దీంతో కేసులో కొత్త మలుపు తిరిగింది. సిట్ నమోదు చేసిన వివరాల ప్రకారం.. టీటీడీ ఉద్యోగులు 7 మంది, ఇతర వ్యక్తులు, అధికారులు నలుగురితో కలిసి ఇప్పటి వరకుక మొత్తం నిందితుల సంఖ్య 11కు చేరింది..
“నాడు ఒకేరోజు.. నేడు పదిరోజులట..?” బీఆర్ఎస్ “దీక్షా దివాస్”పై మంత్రి సీతక్క కౌంటర్..
బీఆర్ఎస్ దీక్షా దివాస్ కి మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు.బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజే దీక్షా దివస్ చేసేవాళ్లన్నారు.. అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదు.. అందుకే ఒక్క రోజుకి అప్పుడు దీక్షా దివస్‌ను పరిమితం చేశారని వ్యాంగ్యంగా స్పందించారు. మంత్రి సీతక్క తాజాగా నాంపల్లిలో మీడియాతో మాట్లాడారు. అధికారం పోయిన తర్వాత పది రోజులపాటు దీక్షా దివస్ పేరుతో నాటకాలు ఆడాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు. ప్రజలను మోసగించేందుకు, అధికార పార్టీ నిర్మించేందుకు పది రోజులపాటు దీక్షా దివస్ నిర్వహిస్తారట.. ఇప్పుడు పది రోజులు డబ్బా కొట్టుకునేందుకు రెడీ అయ్యారని విమర్శించారు. ప్రజలకు పదేండ్లలో చేసిన అభివృద్ధి ఏంటో దీక్షా దివాస్ లో చెప్పాలన్నారు. రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి ఎంతోచేసింది.. విజయాలను ప్రజలకు వివరించేందుకు మేము 10 రోజులపాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మా విజయోత్సవాలను అడ్డుకునే కుట్రతోనే దీక్షా దివస్ పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు.
శ్రీలంకపై జలఖడ్గం.. 123 మంది మృతి.. 130 మంది గల్లంతు
శ్రీలంకపై దిత్వా తుఫాన్ విరుచుకుపడింది. భారీ ఈదురుగాలులతో కుండపోత వర్షం కురిసింది. దీంతో శ్రీలంక అతలాకుతలం అయింది. పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో ఇప్పటి వరకు 123 మంది ప్రాణాలు కోల్పోయారు. 130 మంది వరకు గల్లంతయ్యారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇళ్లు ధ్వంసమయ్యాయని.. 43,995 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు విపత్తు నిర్వహణ కేంద్రం శనివారం తెలిపింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని డైరెక్టర్ జనరల్ సంపత్ కొటువేగోడ తెలిపారు. సాయుధ దళాల సహాయంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. తుఫాన్ బుధవారం తాకిందని.. ద్వీపమంతటా రికార్డ్ స్థాయి వర్షపాతం నమోదైనట్లుగా పేర్కొన్నారు.
రష్యా సంచలన నిర్ణయం.. వాట్సాప్‌పై నిషేధం!
రష్యాలో వాట్సాప్ నిషేధానికి అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు వాట్సాప్‌ను రష్యా బెదిరించింది. రష్యన్ చట్టాన్ని పాటించడంలో విఫలమైతే వాట్సాప్‌ను పూర్తిగా నిషేధం విధిస్తామని రష్యా రాష్ట్ర కమ్యూనికేషన్ వాచ్‌డాగ్ బెదిరించింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రష్యా అధికారులకు సమాచారం అందించడంలో మెటా యాజమాన్యం విఫలమైనట్లుగా తెలుస్తోంది. ప్రజల డేటాను పంచుకోవాల్సిందిగా కోరింది. అందుకు ససేమిరా అందింది. దీంతో రష్యన్ అవసరాలను తీర్చలేనప్పుడు వాట్సాప్ ఎందుకు అని ప్రశ్నిస్తోంది. వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా యూజర్లు దేశీయ యాప్‌లను ఎంచుకోవాలని ప్రజలకు సూచించింది.
పాకిస్థాన్ – ఆఫ్ఘన్ మధ్య ఉద్రిక్తతలు.. కాబూల్‌కు భారత్ సహాయం..
రెండు ముస్లిం దేశాలు పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఇటీవల కాలంలో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇదే సమయంలో కాబూల్‌కు భారత్ మధ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఆఫ్ఘన్ భూభాగంలోకి పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో తొమ్మిది మంది పిల్లలు ఒక మహిళతో మరణించారు. ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత, భారతదేశం శుక్రవారం మందులు, టీకాలు, మానవతా సహాయాన్ని ఆఫ్ఘనిస్థాన్‌కు పంపింది.
ఎన్నికల బరిలో మాజీ మావోయిస్టు జ్యోతి
తెలంగాణలో జరుగుతున్న రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి మాజీ మావోయిస్టు నేత జ్యోతి బరిలోకి దిగుతున్నారు. మావోయిస్టు పార్టీలో 19 సంవత్సరాలుగా పనిచేసి ప్రజా సమస్యల పోరాటానికి కృషి చేశానని, 2023 సంవత్సరంలో సంవత్సరంలో లొంగిపోయిన అనంతరం, గ్రామంలో ప్రజల సమస్యలపై దృష్టి సాధించినట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం లొంగి పోయిన మాజీ మావోయిస్టు నేరెళ్ల జ్యోతి సర్పంచిగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా శివంగలపల్లికి చెందిన నేరెళ్ల జ్యోతి 2005లో దళ సభ్యురాలిగా చేరారు.
అమరావతి కథ అంతులేని కథలా మారింది..
ఏపీ రాజధాని అమరావతి కథ.. అంతులేని కథలా మారింది అని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తే తమకు లబ్ది చేకూరుతుందని ఈ ప్రాంత రైతులు ఉద్యమాలు కూడా చేశారు.. అమరావతి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.. రైతులను పెనం మీద నుంచి పొయ్యిలో పడేసేలా ప్రయత్నం చేస్తున్నారు.. అమరావతి ప్రాంత రైతులు ఇప్పటికే 35 వేల ఎకరాలు భూములు ఇచ్చారు.. మొత్తం ప్రభుత్వ భూములతో కలిపి 50 వేల ఎకరాలతో ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని కడతామని ప్రగల్భాలు పలికారు.. రెండవ దశలో 16,666 ఎకరాలు.. ప్రభుత్వం భూములతో కలిపి 20 ఎకరాలు సేకరించాలని కేబినెట్ లో చర్చించారు.. మళ్ళీ మూడవ దశ కూడా ఉంటుందంటున్నారు.. గతంలో రైతుల దగ్గర భూములు తీసుకునే సమయంలో ఇన్ని దశల్లో భూసేకరణ ఉంటుందని చెప్పలేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలి ..
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. కోనసీమపై తెలంగాణ నాయకుల దిష్టి పడిందని పవన్ కళ్యాణ్ అనడం తప్పు మాత్రమే కాదు, దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. ఎప్పుడూ మేము ఆంధ్రప్రదేశ్ సంక్షేమానికే మద్దతు ఇచ్చామని, రెండు రాష్ట్రాలు సౌహార్దంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటామన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర విభజన అడ్డుపడిందంటే మాత్రం ఊరుకోమన్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అనిరుద్ రెడ్డి.
మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి..
మీడియాతో చిట్ చాట్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధానిలో రైతుల సమస్యల పరిష్కారం కోసం ఒక్కటే కమిటీ వేశాం.. రైతులకు సంబంధించిన ప్రతి పనికి CRDA అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంపై విచారణ చేయిస్తాం.. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లే రాజధాని రైతుల నుంచి సిబ్బంది డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూమిని త్యాగం చేసిన రైతుల సమస్యలు పరిష్కరించకుండా డబ్బులు డిమాండ్ చేస్తారా అని మండిపడ్డారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నాం.. ఇందుకు అనుగుణంగా 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది నాటికి అమరావతి నిర్మాణం ఒక కొలిక్కి వస్తుంది.. రాజధాని ప్రాంతంలో కాకుండా మిగిలిన ప్రాంతాల్లో లేఔట్స్ కి త్వరలోనే అనుమతి ఇస్తాం.. క్యాపిటల్ గెయిన్సు కు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. రాజధాని రైతులంతా ఇక ఒకే గొడుగు కిందకు రావాలని చంద్రబాబు సూచించారు.
1200 మంది అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్ దీక్ష ఎక్కువనా.?
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ సాధనలో అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్ దీక్షను పెద్దది అని చెప్పుకోవడం సరైందా అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన దీక్ష నిజంగా ఎలా జరిగిందో ప్రజలందరికీ తెలుసని, ఆ దీక్షను మహోన్నతంగా చూపించడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. దయాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి, యాదయ్య, ఇషాన్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య వంటి అమరవీరుల త్యాగాలు ఎంత గొప్పవో గుర్తు చేశారు. అలాంటి త్యాగాలను పక్కన పెట్టి కేసీఆర్ దీక్షను ప్రోత్సహించడం బీఆర్ఎస్ నాయకుల రాజకీయ నాటకమని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ దీక్షపై విమర్శలు చేస్తే కేటీఆర్ ఎందుకు అంత అసహనం చూపుతున్నాడని దయాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో పనిచేసిన కాలంలో తెలంగాణ కోసం చిన్నారెడ్డి సంతకాల సేకరణలో మహేష్ గౌడ్ కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. సాగరహారం రోజున కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉన్నారని కూడా ప్రశ్నించారు.