
Hyderabad Police : హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ యూనిట్ తాజాగా ప్రజలకు ముఖ్య హెచ్చరిక జారీ చేసింది. “డిజిటల్ అరెస్ట్” పేరుతో దేశవ్యాప్తంగా పెరుగుతున్న కొత్త రకం సైబర్ మోసాలు హైదరాబాద్‌లో కూడా విస్తరిస్తున్నాయి. నకిలీ పోలీస్, సీబీఐ, ఈడీ, కస్టమ్స్, లేదా కోరియర్ కంపెనీల అధికారులుగా నటిస్తూ కాల్ చేసే మోసగాళ్లు, మనీ లాండరింగ్, టెర్రరిజం, నార్కోటిక్స్ కేసులు, ట్రాఫికింగ్ వంటి తీవ్ర నేరాల్లో కేసులు నమోదయ్యాయని చెప్పి ప్రజలను భయపెట్టి డబ్బు లాక్కోవడం ఈ స్కాం కీలక లక్ష్యం. బాధితులకు వీడియో కాల్ లేదా ఫోన్ ద్వారా “అరెస్ట్ చేస్తున్నాం” అని నటిస్తూ, ఖాతాలను ఫ్రీజ్ చేస్తామని, వారెంట్లు జారీ అయ్యాయని నమ్మించి మోసం చేస్తున్నారు.
మోసగాళ్లు తమ కుట్రను బలపరచేందుకు నకిలీ FIRలు, వన్-బైలబుల్ వారెంట్లు, RBI లేఖలు వంటి కట్టుకథల డాక్యుమెంట్లు తయారు చేసి పంపిస్తారు. అనుమానం లేకుండా ఉండేందుకు కుటుంబ ప్రతిష్టకు హాని కలుగుతుందని చెప్పి ఒత్తిడి పెంచుతారు. కేసు నుండి బయటపడాలంటే భారీ మొత్తం డబ్బు సేకరించి “సుప్రీం కోర్టుకు డిపాజిట్ చేయాలి” అని చెప్పి వెంటనే ట్రాన్స్ఫర్ చేయిస్తారు. కుటుంబ సభ్యులకు చెప్పొద్దని హెచ్చరిస్తూ సోషల్ ఇంజినీరింగ్ పద్ధతులను వినియోగిస్తారు.
ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ యూనిట్ ప్రజలకు స్పష్టమైన సూచనలు ఇస్తోంది.. డిజిటల్ అరెస్ట్ అనే దాంట్లో ఏమీ లేదు. నిజమైన పోలీసులు ఎప్పుడూ ఫోన్, WhatsApp లేదా వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయరు. కాలర్ IDలు స్పూఫ్ చేయబడవచ్చు కాబట్టి ఏ అధికారిక కాల్ వచ్చినా వెంటనే నమ్మేయకూడదు. OTPలు, ఆధార్, బ్యాంక్ వివరాలు వంటి వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఎవరితోనూ పంచకూడదు. అనుమానం వచ్చిన వెంటనే కాల్‌ను కట్ చేసి, కాలర్ ఇచ్చిన నంబర్లకు తిరిగి కాల్ చేయకుండా, స్థానిక పోలీస్ స్టేషన్ లేదా ప్రభుత్వ అధికారిక హెల్ప్‌లైన్‌ద్వారా మాత్రమే ధృవీకరించాలి. WhatsApp మెసేజ్‌లు, స్క్రీన్షాట్లు, కాల్ లాగ్స్ వంటి సాక్ష్యాలను భద్రపరచడం కూడా చాలా ముఖ్యమని అధికారులు తెలిపారు.
ఇలాంటి మోసాలు ఎదురైనపుడు వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.inలో
ఫిర్యాదు చేయాలని సూచించారు. తాజా అప్డేట్ల కోసం హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ అధికారిక సోషల్ మీడియా పేజీలైన Facebook, Instagram, X ఖాతాలను ఫాలో కావాలని చెప్పారు. డిజిటల్ ప్రపంచం వేగంగా మారుతున్న కొద్దీ మోసగాళ్ల పద్ధతులు కూడా అధునాతనంగా మారుతున్నాయి. ఒక్క ఫోన్ కాల్, ఒక్క మెసేజ్ కూడా భారీ నష్టానికి దారితీసే ప్రమాదం ఉంది. అప్రమత్తతే రక్షణ.. మీ డబ్బు, మీ డేటా, మీ భద్రత మీ జాగ్రత్తల్లోనే ఉంది.
Adulterated food: హోటల్లో పాచిపోయిన ఫుడ్.. తస్మాత్ జాగ్రత్త!