
Rainbow Meadows : సంగారెడ్డి జిల్లాలోని కిష్టారెడ్డిపేటలో రెయిన్‌బో మెడోస్ నిర్మాణ సంస్థ పాల్పడిన అతిపెద్ద రియల్ ఎస్టేట్ మోసం తాజాగా వెలుగు చూసింది. హెచ్‌ఎండీఏ ఆమోదించిన లేఅవుట్‌గా నమ్మించి, పలు సర్వే నంబర్లలో ఏకంగా 40 విల్లాలను అక్రమంగా నిర్మించి అమాయక ప్రజలకు విక్రయించారు. ఇటీవల రెవెన్యూ అధికారుల సర్వేలో ఈ విల్లాలన్నీ సర్వే నంబర్లు 198, 199, 204, 208, 210లలోని ప్రభుత్వ భూమిలో ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విల్లాల కోసం ఒక్కో కుటుంబం రూ. 90 లక్షల నుంచి రూ. 1.1 కోటి వరకు వెచ్చించింది. మొత్తంగా, బాధితులు సుమారు రూ. 40 కోట్లకు పైగా పెట్టుబడిని నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ మోసం వెలుగులోకి రాగానే, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళనకు దిగారు. గతంలోనే కొందరు బాధితులు అనుమానం వ్యక్తం చేసినప్పుడు, ఆ భూమి ప్రభుత్వానిదని తేలితే తాము తీసుకున్న డబ్బు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని రెయిన్‌బో మెడోస్ సంస్థ లిఖితపూర్వక ఒప్పందం (MOU) ఇచ్చింది. అయితే, ఇప్పుడు అది ప్రభుత్వ స్థలం అని నిర్ధారణ కావడంతో, నిర్మాణ సంస్థ స్పందించకుండా ముఖం చాటేయడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
తమ ఇళ్లు ప్రభుత్వ భూమిలో ఉన్నట్లు తేలడంతో, హెచ్‌ఎండీఏ, ఎంఆర్ఓ, ఆర్‌డిఓ వంటి ప్రభుత్వ వ్యవస్థలు ప్రభుత్వ భూమిని తనిఖీ చేయకుండా ఈ నిర్మాణాలకు ఎలా అనుమతి ఇచ్చాయని బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంస్థ తమను మోసం చేసిందని ఆరోపిస్తూ, సంస్థ భాగస్వాములైన ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి ప్రసాద్, ఎన్.వి. నరసింహారావులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, తమకు అయిన నష్టాన్ని పూర్తిగా తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం, బాధితులు అమీన్‌పూర్ పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంపై అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో, బాధితులకు న్యాయం జరుగుతుందో లేదో తెలియాల్సి ఉంది.
Mana Shankar Varaprasad Garu OTT Rights: ఆ ఓటీటీలోనే మన శంకర్ వరప్రసాద్‌గారు స్ట్రీమింగ్..