
Rain Alert In AP: దిత్వా తుపాన్ ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు (నవంబర్ 30న ) ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇక, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Read Also: Faf du Plessis: ఇక ఐపీఎల్లో ఈ స్టార్ ప్లేయర్ కనిపించడు..
ఇక, డిసెంబర్ 1వ తేదీన ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనుండగా.. కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. మిగతా జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత ఆదేశాల ప్రకారం అత్యవసర సహాయక చర్యల కోసం కడపలో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వెంకటగిరిలో 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచామని తెలిపారు.
అలాగే, విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి తుఫాన్ గమనాన్ని పర్యవేక్షిస్తూ ప్రభావం చూపే జిల్లాల యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తున్నామని వాతావరణ శాఖ పేర్కొన్నారు. స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లాల్లో మండల స్థాయి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచనలు ఇచ్చామన్నారు. ముందస్తుగానే ప్రభుత్వం శాఖల వారీగా తీసుకోవాల్సిన ఉపశమన చర్యలపై ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఇక, సముద్రంలో వేటకి వెళ్లిన మత్స్యకారులని వెనక్కి రప్పించాం, రైతులు భారీ వర్షాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.