Digital Arrest: ఎయిర్‌టెల్ అధికారిగా, ముంబై పోలీసులగా నటిస్తూ.. 70 ఏళ్ల మహిళ ఖాతా నుంచి రూ.78.89 లక్షలు స్వాహా

70 Year Old Woman Falls Victim To Cyber Fraud In Gurugram

సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ ఘటనలు ఎక్కువై పోతున్నాయి. ఈజీగా డబ్బు సంపాదించుకునేందుకు కొందరు వ్యక్తులు అడ్డదార్లు తొక్కుతూ అమాయకులను మోసం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. నకిలీ పోలీసు అధికారులుగా నటిస్తూ సైబర్ మోసగాళ్ళు గురుగ్రామ్‌లో నివసిస్తున్న 70 ఏళ్ల మహిళను డిజిటల్‌గా అరెస్టు చేశారు. ఆమె బ్యాంక్ ఖాతా, ఫోన్ నంబర్‌ను మనీలాండరింగ్ కోసం ఉపయోగించావని బెదిరించారు. ఆమె ఖాతాలను తనిఖీ చేసే పేరుతో నిందితులు రూ. 78,89,000 బదిలీ చేశారు. తన డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆ వృద్ధురాలు శనివారం సైబర్ పోలీస్ స్టేషన్ సౌత్‌లో ఫిర్యాదు చేసింది.

Also Read:Xiaomi Black Shark GS3 Ultra: 18 రోజుల బ్యాటరీ బ్యాకప్ తో.. షియోమీ బ్లాక్ షార్క్ GS3 అల్ట్రా స్మార్ట్‌వాచ్ రిలీజ్

సెక్టార్ 67 M3M మెర్లిన్ సొసైటీకి చెందిన తమితా సేథి, నవంబర్ 22న తనకు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాల్ చేసిన వ్యక్తి తనను తాను ఎయిర్‌టెల్ నుంచి పరిచయం చేసుకున్నాడని తెలిపింది. తన ఫోన్ నంబర్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని, ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారని నిందితుడు చెప్పినట్లు వెల్లడించింది.

ఆ తర్వాత, నవంబర్ 25న, ఆమెకు మరో వాట్సాప్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను ముంబై పోలీసునని పరిచయం చేసుకున్నాడు. తనను డిజిటల్‌గా అరెస్టు చేస్తున్నట్లు చెప్పాడు. తన ఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతాలను మనీలాండరింగ్ కోసం ఉపయోగిస్తున్నారని చెప్పాడు. వీడియో కాల్‌లో ఉన్న వ్యక్తి పోలీసు యూనిఫాంలో, వెనుక భాగంలో జెండాతో ఉన్నట్లు కనిపించడంతో నిజమేనని భావించినట్లు బాధిత మహిళ తెలిపింది.

Also Read:AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒకే జీవోలో ఇద్దరు సీఎస్ల నియామకం..

ఆ నకిలీ పోలీసు అధికారి ఆ వృద్ధ మహిళ నుంచి ఆమె ఖాతా లావాదేవీలు గురించి సమాచారం పొందాడు. తరువాత, ఆమె ఖాతాలను తనిఖీ చేసే కారణంతో, రూ. 78,89,000 ఆన్‌లైన్‌లో బదిలీ చేసుకున్నాడు. దర్యాప్తు పూర్తయిన తర్వాత డబ్బు తిరిగి ఇస్తామని ఆమెకు చెప్పాడు. కానీ డబ్బు తిరిగి రాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా సైబర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.