
పార్టీ ఆవిర్భావం తర్వాత బోణీ కొట్టిన నియోజకవర్గంలో గ్లాస్ ఇంకా బ్యాలెన్స్ అవడం లేదా? నాయకుడు మారినా నడిపే తీరు మాత్రం మారడం లేదా? దశాబ్దానికి పైగా పార్టీ జెండా మోసిన వాళ్ళు అందుకే హర్ట్ అవుతున్నారా? రాజోలు జనసేన రచ్చకు అసలు కారణం ఏంటి? పవన్ వార్నింగ్ ఇచ్చాక కూడా పరిస్థితులు మారే అవకాశం లేదా? లెట్స్ వాచ్. పార్టీ పెట్టాక తొలిసారి 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క అసెంబ్లీ సీటు రాజోలులో గెలిచింది జనసేన. ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ చీకట్లో వెలుగులా తనకు రాజోలు మీద ప్రత్యేక అభిమానం అని చెప్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. కానీ… అప్పుడు పార్టీ తరపున గెలిచిన వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆ తర్వాత వైసీపీ గూటికి చేరారు. పార్టీ మారిపోయాక అధినేతతో పాటు నియోజకవర్గ జనసేన కార్యకర్తల మీద ఛాన్స్ వచ్చిన ప్రతి సందర్భంలోనూ విమర్శలు చేసేవారు రాపాక. ఇక వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో… రిటైర్డ్ ఐఏఎస్ దేవ వరప్రసాద్ జనసేన నుంచి రాజోలు ఎమ్మెల్యే అయ్యారు. వరుసగా రెండు సార్లు ఈ నియోజకవర్గాన్ని పార్టీ సొంతం చేసుకున్నా… స్థానిక పరిస్థితులు మాత్రం అంత సానుకూలంగా ఉండటం లేదన్నది లేటెస్ట్ టాక్. ప్రస్తుతం రాజోలు జనసైనికులకి, ఎమ్మెల్యేకి గ్యాప్ వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. గతంలో రాపాక వరప్రసాద్ జనసేన నుంచి గెలిచినా… అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయిపోయేవారు.
ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా వైసీపీతో అంటకాగకున్నా… ఆ పార్టీ వాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నది పాత జనసేన కేడర్ ఆరోపణ. గత ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులకు కండువా మార్చేసి దగ్గరకు చేర్చుకుంటున్నారని, తొలి నుంచి పార్టీ విషయంలో కమిట్మెంట్‌తో ఉన్న జన సైనికులను దూరం పెట్టేసి వైసీపీ నుంచి తెచ్చుకున్న వాళ్ళకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న అసహనం పెరుగుతోంది. ఈ క్రమంలోనే… రాజోలు గ్లాస్‌లో రచ్చ రంబోలా అవుతోందట. గతంలో గెలిచిన ఎమ్మెల్యే పార్టీ మారిపోయాడు, ఇప్పుడు గెలిచినాయనేమో… పక్క పార్టీల నుంచి తీసుకొచ్చి నెత్తినెక్కించుకుంటున్నారు. నానా కష్టాలు పడి రెండు సార్లు మేం గెలిపించింది ఇందుకేనా అంటూ లోకల్ జన సైనికులు తీవ్ర అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా రెండుసార్లు పార్టీని గెలిపించిన తమకు చివరికి గుండు సున్నా మిగిలిందన్నది వాళ్ళ నిర్వేదం. ఈ పరిస్థికుల్లో రాజోలు జనసేనలో రోజు రోజుకీ కోల్డ్‌వార్ ముదురుతున్నట్టు చెబుతున్నారు. ఎమ్మెల్యే ఒక వర్గాన్ని మెయిన్‌టెయిన్ చేస్తుంటే… తొలి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళు మరో గ్రూపుగా తయారయ్యారు. వరప్రసాద్ అండతో ఇప్పుడు పెత్తనం మొత్తం పాత వైసీపీ వాళ్లే చేస్తున్నారంటూ లోకల్ జనసేన లీడర్లకు చిర్రెత్తుకొస్తోందట. ఈనెల 26న డిప్యూటీ సీఎం రాజోలు పర్యటనలో నరసింహ అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరిగాడని, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని జనసేన ప్రకటించింది. నరసింహ గతంలో వైసీపీలో పనిచేసి ఎన్నికల తర్వాత జనసేనలోకి వచ్చాడు.
పవన్ కళ్యాణ్ పర్యటనకు వీఐపీ పాస్‌ల విషయంలో కూడా తన వర్గానికే ప్రయారిటీ ఇచ్చారట ఎమ్మెల్యే. అందుకే వ్యతిరేకవర్గం ఈ విధంగా కౌంటర్ ఇచ్చిందన్న చర్చ నడుస్తోంది. ఆయనకు నచ్చని వాళ్ళు సొంత పార్టీ నేతలైనాసరే… పాస్‌ల విషయంలో దూరం పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. దాంతో నరసింహ మాజీ వైసీపీ లీడర్ అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారట పాత జనసైనికులు. మరోవైపు బహిరంగ సభలో కూడా సేనాని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.. తనకు నాయకులు ముఖ్యం కాదని, అవసరమైతే వాళ్లని వదిలేస్తానని…., రాజోలు కార్యకర్తలు, జనాన్ని మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని క్లారిటీగా చెప్పేశారు. గొడవలతో రోడ్డున పడొద్దని కూడా కేడర్‌కు స్పష్టత ఇచ్చారాయన. అయినా సరే… కోల్డ్ వార్ మాత్రం ఆగడం లేదు. గత ప్రభుత్వంలో ఎవరిపైన ఫైట్ చేసామో మళ్లీ వాళ్లే వచ్చి తమ నెత్తి ఎక్కారంటూ… ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. మరో వైపు ఎమ్మెల్యే మాత్రం గెలిచిన తర్వాత చేరికలు కామన్ అంటూ… అలా అయితేనే పార్టీ బలపడుతుందని అంటున్నారు. మొత్తానికి పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిగా ఖాతా తెరచిన నియోజకవర్గంలో రచ్చ రోజురోజుకీ పీక్స్ చేరుతోంది. గతంలో గెలిచిన ఎమ్మెల్యే ఆ విధంగా చేస్తే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మరో రూటు ఎంచుకున్నారు. ఎవరు మారినా తమ పరిస్థితి మాత్రం మారదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజోలు జనసైనికులు.