
Suryapet: తెలంగాణ పంచాయతీ ఎన్నికల వేళ గ్రామీణ రాజకీయాలు ఊహించని మలుపులు తీసుకుంటున్నాయి. సాధారణంగా గ్రామస్థాయి పదవుల కోసం స్థానికులు, వ్యాపారులు, రైతులు పోటీకి దిగడం చూస్తుంటాము. అయితే ఈసారి సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో చోటుచేసుకున్న పరిణామం అందరి దృష్టినీ ఆకర్షించింది. సర్వీస్ మిగిలి ఉండగానే సబ్‌ఇన్‌స్పెక్టర్ పులి వెంకటేశ్వర్లు ఉద్యోగాన్ని వదిలి సర్పంచ్ పదవికే నేరుగా పోటీ చేసేందుకు సిద్ధమవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
READ MORE: Pocharam Infocity: ఇన్ఫోసిస్ క్యాంపస్ సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు.. కట్‌చేస్తే..
పదవి విరమణ వరకు ఇంకా ఐదు నెలల సర్వీస్ ఉన్నా పక్కన పెట్టి గ్రామం కోసం పనిచేయాలనే ఆసక్తి ఆయన నిర్ణయానికి ప్రధాన కారణంగా స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా ఉన్నతస్థాయి అధికారులు రాజకీయాల్లోకి రావాలంటే పదవీ విరమణ తర్వాతే అడుగు వేస్తారు. కానీ, గ్రామ పంచాయతీ స్థాయిలోనే తన ప్రజా సేవ ప్రారంభించాలని భావించిన వెంకటేశ్వర్లు, పెద్ద పదవి కోసం కాకుండా స్వగ్రామ అభివృద్ధే ప్రాధాన్యమని భావించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, నేటి నుంచి రెండో దశ నామినేషన్ల సందడి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. జిల్లాల వారీగా పార్టీల అంతర్గత చర్చలు వేడెక్కుతున్నాయి. ఎవరు పోటీ చేయాలి, ఎవరు పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగాలి, ఎవరు ఎవరికి వ్యతిరేకం అన్న విషయంలో నేతలు మీటింగ్‌ల మీద మీటింగ్‌లు పెడుతున్నారు. గ్రామాల్లో ఒకే పదవికి పలువురు ఆసక్తి చూపడం వల్ల అభ్యర్థుల ఎంపిక కఠినంగా మారింది.