
Kondagattu: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు గుట్ట కింద( స్టేజీ వద్ద) ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదలైన చిన్న స్పార్క్ క్షణాల్లోనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడేలా చేసింది. కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారి వరకు దాదాపు 32 బొమ్మల దుకాణాలకు నిప్పంటుకొని సామగ్రి కాలి బూడిదైంది. అగ్ని తీవ్రత ఎక్కువగా ఉండటంతో 20కి పైగా దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు అదుపు చేయడానికి స్థానికులు ప్రయత్నించినా, ప్లాస్టిక్, చెక్క సామగ్రి ఎక్కువగా ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. ఫైరింజన్లు చేరుకునేలోపే ఎక్కువ శాతం దుకాణాలు బూడిదైపోయాయి.
READ MORE: Rain Alert In AP: ఏపీపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ప్రాథమిక అంచనాల ప్రకారం కోటి రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకొని వ్యాపారులు భారీ మొత్తంలో బొమ్మలు కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. పూజా సామగ్రి, నీటిబాటిల్లు, భక్తులకు అవసరమైన ఇతర వస్తువులు అమ్మే షాపులు ఈ ప్రమాదంలో పూర్తిగా నష్టం చవిచూశాయి. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం ఏదీ సంభవించలేదు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. మళ్లీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా విద్యుత్ కనెక్షన్లు, షాపుల సేఫ్టీ ప్రమాణాలను పునఃసమీక్షించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
READ MORE: Suryapet: సర్పంచ్ ఎన్నికల్లో పోటీ కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన ఎస్సై..