
కమ్యూనికేషన్ యాప్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సిమ్ బైండింగ్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. అంటే.. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్, అరట్టై, జోష్ వంటి ప్రసిద్ధ యాప్‌లు ఇకపై యాక్టివ్ సిమ్ కార్డ్ లేకుండా పనిచేయలేవు. డివైజ్‌లో సిమ్ కార్డు ఉంటేనే యాప్‌లు పనిచేసేలా చూడాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సూచించింది. టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నియమాలు 2025 ప్రకారం ఈ నియమాన్ని కేంద్రం అమలు చేసింది.
దేశంలో యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలు టెలికాం మాదిరిగానే కఠినమైన నిబంధనలకు లోబడి ఉండటం ఇదే మొదటిసారి. కొత్త సిమ్-బైండింగ్ నియమం బ్యాంకింగ్, యుపీఐ యాప్‌ల మాదిరిగానే ఈ యాప్‌లకు కూడా వర్తిస్తుంది. సిమ్ యాక్టివ్‌గా లేకుంటే యాప్‌లలో లాగిన్ అవ్వడం కుదరదు. ఈ యాప్‌లను టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైయర్ యూజర్ ఎంటిటీలుగా ప్రభుత్వం వర్గీకరించింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు యూజర్ సిమ్ కార్డ్ ఎప్పుడూ యాప్‌కి లింక్ చేయబడి ఉంటుంది. యూజర్ ఏ సిమ్‌తో అకౌంట్ రిజిస్టర్ చేశారో.. ఆ సిమ్ మాత్రమే ఫోన్లో ఉంటేనే యాప్ పని చేస్తుంది. సిమ్ తీసేసినా లేదా ఫోన్ మార్చినా యాప్ ఆటోమాటిక్‌గా లాగౌట్ అవుతుంది.
వెబ్ బ్రౌజర్ ద్వారా యాప్‌ను ఉపయోగించే వారి కోసం కూడా మార్పు చేయబడింది. యూజర్ వెబ్ బ్రౌజర్లో యాప్ సేవలను ఉపయోగిస్తే.. ఆ ప్లాట్‌ఫామ్ ప్రతి ఆరు గంటలకు లాగౌట్ అవుతుంది. సేవలు పొందాలంటే క్యూఆర్ కోడ్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సిమ్ బైండింగ్ వల్ల మోసపూరిత కార్యకలాపాలు తగ్గించడమే కేంద్రం ముఖ్య ఉద్దేశం. 90 రోజుల్లో ఈ నిబంధనలను అమలు కానుంది.
ప్రస్తుతం చాలా మెసేజింగ్ యాప్‌లు మొదటిసారి ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రమే మొబైల్ నంబర్‌ను ధృవీకరిస్తాయి. ఆ తర్వాత సిమ్‌కార్డు తొలగించినా, డీయాక్టివేట్ చేసినా.. యాప్ రన్ అవుతూనే ఉంటుంది. దాంతో సైబర్ నేరగాళ్లు యాప్స్‌ను వినియోగించుకోవడం సులువుగా వీలవుతుందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటోంది. సైబర్ నిపుణులు వినియోగదారుల సున్నితమైన సమాచారాన్ని సులభంగా ట్రాక్ చేయగలరని, ఇలా చేస్తే ఆవకాశాలు బాగా తగ్గుతాయని భావిస్తున్నారు. ఈ నియమం సైబర్ భద్రతను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం యూపీఐ పేమెంట్ యాప్స్.. సిమ్ ఉంటేనే సేవలందిస్తున్న విషయం తెల్సిందే.