Botsa Satyanarayana: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది..

Botsa Satyanarayana Slams Ap Government

Botsa Satyanarayana: రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. రైతులు గానీ, రైతు కూలీలు పంటకు కావాల్సిన ఎరువుల కోసం ఎంతలా కొట్లాడారో చూశాం.. బ్లాక్ మార్కెట్ లో ఎరువులు కొనుక్కొని పంట పండించిన పరిస్థితి ఏర్పడింది.. ఆ పంట చేతికొచ్చిన తర్వాత ప్రకృతి వైపరీత్యాలు వల్ల నష్టపోయారు.. ప్రభుత్వం ఎక్కడ రైతులను ఆదుకున్న దాఖలాలు కనపడలేదని ఎద్దేవా చేశారు. చేతికొచ్చిన పంటను అమ్ముకుందాం అనుకుంటే గత ఏడేనిమిది ఏళ్ళల్లో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులను రైతులు ఎదుర్కొంటున్నారు.. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు.. అరటి, మొక్క జొన్న, పొగాకు, ప్రత్తి ఏ పంటకు కూడా సరైన గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చెరుకుకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంట వేసుకుంటున్నారు.. గత ప్రభుత్వ హయాంలో పంటకు కొనుగోలులో ఇబ్బందులు వస్తే వెంటనే ప్రభుత్వం కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేసిందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Read Also: Putin- Modi Meeting: భారత పర్యటనకు రష్యా అధినేత.. పుతిన్ పర్యటనతో మరిన్ని ఒప్పందాలు?

అయితే, నేటి ప్రభుత్వ హయాంలో రైతుల బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదని మాజీ మంత్రి బొత్స అన్నారు. రైతులు నష్టపోతుంటే కేంద్రానికి లేఖలు రాయడం ఏమిటి? అని ప్రశ్నించారు. రైతులు మొదట నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.. ఆ తర్వాత కేంద్రానికి లేఖలు రాసి రియంబర్స్మెంట్ పొందాలని తెలిపారు. ఇది ఆనాదిగా వస్తున్న వ్యవహారం.. కానీ, నేడు అలాంటి పరిస్థితి లేదు.. ప్రతిపక్షంలో మేము ప్రశ్నిస్తుంటే రాజకీయం చేస్తున్నామని అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. మా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు.. మొక్క జొన్నకు సంబంధించిన కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదు.. ఇప్పటికే రైతులు బక్కచిక్కుపోతున్న సమయంలో రైతుల మీద ఎందుకు ఇంత చిన్న చూపులు, ఎందుకు అలసత్వం అని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.

Read Also: Rohit Sharma: వరల్డ్‌ రికార్డ్‌ ముందు రోహిత్‌ శర్మ.. ఇక మరెవరికీ సాధ్యం కాకపోవచ్చు!

ఇక, వ్యవసాయ శాఖ మంత్రి ఆలోచించాలి, మీరు ఈ ప్రాంతానికి చెందిన వారే కదా అని ఎమ్మెల్సీ సత్యనారాయణ కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతులన్నా, రైతు సమస్యలన్న అక్కర్లేదు.. ఎంత సేపు పెద్ద పెద్ద వాటి కోసమే ఆలోచిస్తుంటారు.. విశాఖలో ఎక్కడ ఖాళీ భూములు ఉన్నాయి.. రూపాయికి ఇచ్చేద్దామని ఆలోచనలోనే ఉంటారు.. బ్యాక్ డోర్ లో ఏ విధంగా దోచుకుని తిందామనే ఆలోచన తప్ప మరి ఇంకేం లేదని విమర్శించారు. రైతులకు కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు?.. ఇప్పటికే 70 నుంచి 80 శాతం వరకు ప్రైవేట్ మార్కెట్లలో తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉంది.. వ్యవసాయ స్థితిగతులు మారాలని బొత్స సత్యనారాయణ అన్నారు.