
Adulterated food: పర్యాటక నగరంగా పేరుగాంచిన విశాఖపట్నంలో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పేరుకు మాత్రమే హంగులతో ఆకర్షిస్తూ, లోపల మాత్రం రోజుల తరబడి నిల్వ ఉంచిన పాచిపోయిన ఆహారాన్ని వేడి చేసి వడ్డిస్తున్నారు. రుచి కోసం రకరకాల రంగులు, హానికరమైన రసాయనాలు కలుపుతూ ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేపట్టినా యాజమాన్యాల తీరు మారకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో హోటళ్ల అరాచకం రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో, ఆహార భద్రతా ప్రమాణాల శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో అధికారులకు కళ్లు బైర్లు కమ్మే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. దాదాపు ఏ రెస్టారెంట్ చూసినా కల్తీగా మారిపోయింది.
Read Also: Uzbekistan: ఈ ముస్లిం దేశంలో ఏక కాలంలో 2 వేల మసీదులలో ప్రార్థనలు.. దీని కోసమేనా!
అయితే, ఈ ఏడాది ఆగస్టు నెలలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన విస్తృత తనిఖీల్లో 40 హోటళ్లు, రెస్టారెంట్లలో కిలోల కొద్దీ నిల్వ ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా 17 హోటళ్లలో అత్యంత దారుణ స్థితిలో ఉన్న ఆహారాన్ని గుర్తించి, వాటిపై కేసులు నమోదు చేశారు. అక్కయ్యపాలెంలోని నరసింహ నగర్ లో ముంతాజ్ హోటల్ ఈ ఏడాది జూన్ నెలలో జరిపిన తనిఖీల్లో ఇక్కడ కుళ్లిపోయిన కోడిగుడ్లు, చికెన్, చేప, రొయ్య వంటకాలను గుర్తించారు. హోటల్‌పై కేసు కూడా నమోదు చేశారు. అలాగే, ఏంవీపీ కాలనీలో గల ఆహా ఏమి రుచులు రెస్టారెంట్ లో ఆగస్టు 22న జరిపిన దాడుల్లో ఈ రెస్టారెంట్లో నాలుగైదు రోజులకు మించి నిల్వ ఉన్న 85 కిలోల చికెన్, మటన్, రొయ్యలు, చేపలను అధికారులు గుర్తించారు.
Read Also: Addanki Dayakar : 1200 మంది అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్ దీక్ష ఎక్కువనా.?
ఇక, నరసింహ నగర్ లోని మరో హోట్ సెలబ్రేషన్స్ పై నవంబర్ 11న తనిఖీ చేయగా 13 కిలోల నిల్వ ఉంచిన బిర్యానీ లభించింది. అలాగే, నగరంలో దాదాపు 1000 వరకు హోటళ్లు, రెస్టారెంట్లలో ఉన్న ఎక్కడ తనిఖీ చేసినా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు దొరకడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ హోటల్స్ తీరు మారడం లేదు. రోజుల తరబడి నిల్వ చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పాడైన ఆహారం వల్ల ప్రాథమికంగా జీర్ణకోశ, క్యాన్సర్, అల్సర్, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మాంసాహార వంటకాలను నిల్వ చేయడం వల్ల అందులోని ప్రోటీన్ నాణ్యత తగ్గి, టైఫాయిడ్, డయేరియా బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.