
కోవిడ్ తర్వాత మరో కొత్త వైరస్ అయిన బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుఎంజా) మన దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మొదట పక్షుల్లో కనిపించే వ్యాధి అయినప్పటికీ, ప్రస్తుతం జంతువులకు వ్యాపిస్తూ, మ్యూటేషన్ ద్వారా మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని అంటున్నారు.
ఈ వైరస్ మొదటిసారి 2003లో వియత్నాంలో నమోదైంది. పక్షుల్లో తీవ్రంగా వ్యాపించే ఈ వ్యాధి, మనుషులకు సోకితే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2003 నుండి 2025 వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,000 H5 బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనట్లు సర్వేలు సూచిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ వ్యాధి మరణాల రేటు సుమారు 48% గా ఉంది.
ఇటీవలి కాలంలో USAలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఈ వైరస్ వల్ల మరణించిన ఘటన వెలుగుచూసింది. ప్రస్తుతానికి కేసులు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
అనుమానాస్పదంగా కనిపించే పక్షులు లేదా జంతువులకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మాంసం, గుడ్లు వంటివి పూర్తిగా బాగా ఉడికించిన తరువాత మాత్రమే తీసుకోవాలి. పక్షులు, జంతువులతో పని చేసే వారుచేతులు కడుక్కోవటం, శానిటైజర్ వాడటం వంటివి తప్పనిసరిగా పాటించాలి. చనిపోయిన పక్షులు లేదా అస్వాభావిక మరణాలు గమనించినప్పుడు తక్షణం అధికారులకు తెలియజేయాలి. ఇంటి పరిసరాల్లో శుభ్రత పాటిస్తూ, పక్షులు–జంతువులతో అనవసర సమీపాన్ని నివారించాలి.