
BrahMos Deal: ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా భారత బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేయడానికి సిద్ధమవుతోంది. నిజానికి భారతదేశం – ఇండోనేషియా మధ్య ఈ చారిత్రాత్మక రక్షణ ఒప్పందం చివరి దశలో ఉంది. ఇండోనేషియా త్వరలో భారతదేశంలో అత్యంత ప్రాణాంతకమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను కొనుగోలు చేస్తుందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి ఈ వార్త పొరుగున ఉన్న పాకిస్థాన్‌కు కచ్చితంగా ఆగ్రహం తెప్పిస్తుంది.
READ ALSO: సేఫ్టీలో సంచలనం సృష్టించిన Honda Amaze.. అడల్ట్ ప్రొటెక్షన్‌లో 5 స్టార్ రేటింగ్..!
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ – ఇండోనేషియా రక్షణ మంత్రి సయాఫ్రి సియామ్‌సుద్దీన్‌కు బ్రహ్మోస్ క్షిపణి షిల్డ్‌ను బహుకరించారు. బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి భారతదేశం – ఇండోనేషియా మధ్య ఒప్పందం ఖరారు అయ్యిందని, ఇక అధికారిక ప్రకటన వెలువడటమే ఆలస్యం అని సమాచారం. ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్‌లో బ్రహ్మోస్ క్షిపణి వాడకం గురించి ఇండోనేషియా బృందానికి ప్రత్యేక బ్రీఫింగ్ కూడా అందిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశం అయిన ఇండోనేషియా – భారతదేశం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇండోనేషియా రక్షణ మంత్రి సయాఫ్రి స్యాంసుదిన్ నేతృత్వంలోని సీనియర్ ప్రతినిధి బృందం ఢిల్లీలోని బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. క్షిపణి వ్యవస్థ సామర్థ్యాల గురించి ఈ ప్రతినిధి బృందానికి వివరించినట్లు తెలుస్తుంది. ఇండోనేషియా బ్రహ్మోస్‌కు సంబంధించి భూమి, నావికా, వైమానిక దళ వెర్షన్లను కోరుతోందని, అయితే ఈ బృందం నావికా వెర్షన్‌పై ప్రత్యేక ఆసక్తి చూపిందని, దీంతో ఇండోనేషియా ముందుగా బ్రహ్మోస్ నావికా వెర్షన్‌ను అందుకునే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా సుఖోయ్ 30 యుద్ధ విమానాల కొనుగోలు అంశాన్ని కూడా ఇండోనేషియా తీవ్రంగా పరిశీలిస్తోంది.
ఫిలిప్పీన్స్లాగే ఇండోనేషియా కూడా చైనాకు వ్యతిరేకంగా తన వ్యూహాత్మక బలాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తోందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ ప్రయత్నంలో భాగంగా దక్షిణ చైనా సముద్రంలో ఇండోనేషియా యుద్ధనౌకలకు బ్రహ్మోస్ క్షిపణులను అమర్చాలని చూస్తుంది. దీంతో ఈ యుద్ధ నౌకలపై చైనా ఏదైనా చర్య తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించే అవకాశం ఉంటుందని భావిస్తుంది. బ్రహ్మోస్ క్షిపణి సామర్థ్యంపై చైనాకు ఒక అంచనా ఉందని, కాబట్టి బ్రహ్మోస్ క్షిపణులతో బహుళ యుద్ధనౌకలపై దాడి చేస్తే, చైనా వైపు విధ్వంసం ఖాయం అని ఇండోనేషియా ఆలోచిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే భారత బ్రహ్మోస్ ఇండోనేషియా సముద్ర భద్రత, వాయు రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది.
బ్రహ్మోస్ ప్రత్యేక లక్షణాల గురించి చెప్పాలంటే.. దీనిని భారతదేశం – రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, అత్యంత అధునాతన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. దీని వేగం మాక్ 2.8, లేదా గంటకు 3,450 కి.మీ. దీని పరిధి 290 కిలోమీటర్లు. ఇది భూమి, సముద్రం, గాలి నుంచి అధిక కచ్చితత్వంతో దాడి చేయగలదు. ఇంకా దీనిని ట్రాక్ చేయడం చాలా కష్టం. అలాగే శత్రువు ఈ క్షిపణి గురించి తెలుసుకునే సమయానికి, అప్పటికే ఇది కచ్చితమైన లక్షాలపై విధ్వంసం సృష్టిస్తుంది.