
CP Sajjanar : హైదరాబాద్ లో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా, ముఠా తగాదాలతో అశాంతి రేపుతున్న అసాంఘిక శక్తులపై నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్ కఠిన చర్యలు తీసుకున్నారు. పది ప్రధాన ముఠాలకు చెందిన సభ్యులను ఆయన టీజీఐసీసీసీకి పిలిపించి.. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) హోదాలో ప్రత్యేక కోర్టు నిర్వహించారు.
నగరంలోని సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ పరిధిల్లో ఆధిపత్య పోరు కోసం ఘర్షణ పడుతున్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతూ, ప్రత్యర్థి ముఠాలపై దాడులకు తెగబడుతున్న వారిని పోలీస్ కమిషనర్ విచారించారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 126 కింద 86 మందిని కమిషనర్ బైండోవర్ చేశారు. రాబోయే ఏడాది కాలం పాటు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడబోమని, సత్ప్రవర్తనతో ఉంటామని వారి చేత సెక్యూరిటీ బాండ్లు రాయించుకున్నారు.
బాండ్ రాసిచ్చిన కాలపరిమితిలోపు ఎవరైనా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని సీపీ సజ్జనర్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బాండ్‌ను రద్దు చేయడంతో పాటు, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విచారణలో స్పెషల్ బ్రాంచ్ డీసీపీ కె.అపూర్వారావు, సంబంధిత ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.