
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో కొనసాగుతున్న ‘దిత్వా’ తుపాను తమిళనాడుపై పంజా విసురుతోంది. తమిళనాడులో శనివారం అర్దరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు, మైలాడుతురై, నాగపట్నం, రామనాథపురం,తంజావూరు, తిరువారూరు, కోయంబత్తూరులో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 62కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. చెన్నై-శ్రీలంక విమాన సర్వీలు రద్దయ్యాయి.
నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరంలో దిత్వా తుఫాన్ కొనసాగుతోంది. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 150 కిమీ దూరంలో, దక్షిణంగా చెన్నైకి 250 కిమీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దాంతో దక్షిణ కోస్తా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. గత 6 గంటల్లో గంటకు 5 కిమీ వేగంతో ఉత్తరం వైపుకు కదిలి.. కారైకల్ కు తూర్పున 80 కిమీ, జాఫ్నాకు ఈశాన్యంగా 140 కిమీ, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 160 కిమీ, చెన్నై దక్షిణంగా 250 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
Also Read: IND vs SA: నేడే తొలి వన్డే.. చాన్నాళ్ల తర్వాత బరిలోకి రో-కో! గంబీర్‌కు ప్రియమైన వ్యక్తికి చోటు
రాబోయే 24 గంటల్లో ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా దాదాపు ఉత్తరం వైపు కదిలే అవకాశం ఉంది. ఉత్తరం వైపు కదులుతూ తుఫాను ఈరోజు ఉదయం లేదా సాయంత్రం నాటికి తమిళనాడు-పుదుచ్చేరి తీరప్రాంతం నుండి నైరుతి బంగాళాఖాతంలో 50 కిమీ-25 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంటుంది. ఈరోజు దక్షిణ కోస్తాపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాలో అతి భారీ వర్షాలు పడనున్నాయని అధికారులు చెప్పారు. సోమవారం దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.