
కల్తీకి కాదేది అనర్హం అన్నట్లు ఇప్పుడు గుడ్లు కూడా కల్తీ అవుతున్నాయి. కొందరు వ్యక్తులు డబ్బు మోజులో పడి దారుణాలకు ఒడిగడుతున్నారు. మంచి పోషకాలను అందించే గుడ్డును దాదాపు అందరు తమ డైట్ లో చేర్చుకుంటుంటారు. దీన్ని క్యాష్ చేసుకోవడం కోసం ఏకంగా ఆర్టిఫిషియల్ కలర్ ను ఉపయోగించి ఎగ్స్ తయారు చేస్తున్నారు. మొరాదాబాద్‌లోని ఆహార భద్రతా విభాగం పెద్ద మోసాన్ని బయటపెట్టింది. ఆ శాఖ ఒక గిడ్డంగిపై దాడి చేసి, కృత్రిమ రంగులతో దేశీ గుడ్లను తయారు చేస్తున్న మొత్తం ఫ్యాక్టరీని గుర్తించింది. సంఘటనా స్థలం నుండి 80,000 గుడ్లను బృందం స్వాధీనం చేసుకుంది. వీటిలో 45,360 రంగు గుడ్లు, 35,640 తెల్ల గుడ్లు ఉన్నాయి. వీటిని రంగు వేసి దేశీ గుడ్లుగా మార్చారు. అన్ని గుడ్లను వెంటనే జప్తు చేసి, మొత్తం గిడ్డంగిని సీజ్ చేశారు.
Also Read:Tomato Prices: భగ్గుమంటున్న టమాటా.. నెల రోజుల్లో 43% పెరిగిన ధరలు..
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్ల గుడ్లకు భారతీయ గుడ్లను పోలి ఉండేలా కృత్రిమంగా రంగులు వేస్తున్నారు. ఈ రంగు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తుందంటున్నారు నిపుణులు. గుడ్ల రంగును మార్చడానికి ఉపయోగించే టీ ఆకు ద్రావణం, సిదానూర్ అనే రసాయనాన్ని కూడా ఈ బృందం గుర్తించింది. ఈ గుడ్ల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.389,772 అని అధికారులు తెలిపారు. రంగు వేసిన గుడ్లు ఎక్కడికి సరఫరా అవుతున్నాయో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని వారు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.