Gautam Gambhir-BCCI: స్వదేశంలో రెండు వైట్‌వాష్‌లు.. గంభీర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం!

Bcci Stands By Gautam Gambhir Despite Back To Back Home Test Whitewashes

ఏడాది కాలంలో స్వదేశంలో టెస్టుల్లో భారత్ రెండు వైట్‌వాష్‌లను ఎదుర్కొంది. భారత గడ్డపై న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేశాయి. 2024 నవంబర్‌లో న్యూజిలాండ్ చేతిలో 0-3తో సిరీస్ ఓడిపోవడం భారత క్రికెట్ చరిత్రలోనే ఓ మాయని మచ్చగా నిలిచింది. 2025 ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో వైట్ వాష్‌కు గురవడం ప్రతి ఒక్కరిని షాక్‌కు గురిచేసింది. ఈ రెండు వైట్‌వాష్‌లు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేప్పట్టాకే జరిగాయి. దాంతో గౌతీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

కోచ్ గౌతమ్ గంభీర్ తీరుపై అటు మాజీలు, ఇటు అభిమానులు గుర్రుగా ఉన్నారు. అతనిని కోచ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం టెస్ట్ క్రికెట్ బాధ్యతల నుంచి అయినా తొలగించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం గౌతీకి అండగా నిలుస్తోందని సమాచారం. రెండు వైట్‌వాష్‌లు ఎదురైనా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి బీసీసీఐ సిద్ధంగా లేదట. మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీపై బీసీసీఐ అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది.

Also Read: Rohit Sharma: వరల్డ్‌ రికార్డ్‌ ముందు రోహిత్‌ శర్మ.. ఇక మరెవరికీ సాధ్యం కాకపోవచ్చు!

సెలక్షన్ కమిటీ ఆల్‌రౌండర్‌లపై అతిగా ఆధారపడటం పట్ల బీసీసీఐ ఆగ్రహంగా ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి. సెలెక్టర్లపై అధికంగా ఆధారపడటం ప్రతికూల ఫలితాన్నిస్తుందని బీసీసీఐ భావిస్తోందట. దక్షిణాఫ్రికాతో మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ముగ్గురు ఆల్‌రౌండర్‌లను (రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్) ఆడగా.. రెండవ టెస్ట్‌లో ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్‌లను (జడేజా, సుందర్), ఒక మీడియం-పేస్ ఆల్‌రౌండర్‌ (నితీష్ కుమార్ రెడ్డి)ను ఆడించింది. రెండు మ్యాచ్‌లలో ఆల్‌రౌండర్‌లు బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. ఇటీవలి రోజుల్లో పలువురు మాజీ దిగ్గజాలు జట్టు యాజమాన్యం ఆల్‌రౌండర్‌లపై అతిగా ఆధారపడటాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే.