
Harish Rao: తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకం కేసీఆర్ అని మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. నేడు దీక్షా దివస్ పురస్కరించుకొని ఎక్స్ లో పోస్ట్ చేశారు. “‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29న ప్రారంభించిన ఆమరణ దీక్ష, ఉద్యమ గతిని మలుపు తిప్పింది. సరికొత్త చరిత్రకు నాంది పలికింది. తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసింది. ‘రానే రాదు, కానే కాదు’ అన్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సబ్బండ వర్గాలను ఏకం చేసి సుసాధ్యం చేసి చూపిన ఘన చరిత కేసిఆర్ ది.. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు అలుపెరగని పోరాటం చేసిన చరిత్ర కేసీఆర్ ది.. పదవులే కాదు, తెలంగాణ కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడ్డ ధీరత్వం కేసీఆర్ ది.. తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకం కేసీఆర్. నాలుగు కోట్ల ప్రజల్లో మార్మోగే ‘జై తెలంగాణ’ అనే రణ నినాదం కేసీఆర్.. నవంబర్ 29న కేసీఆర్ దీక్ష లేకుండా డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకుండా తెలంగాణ రాష్ట్రం లేదు.. దశాబ్దాల పోరాటంతోనే తెలంగాణ సిద్ధించింది తప్ప పాలకుల దయాదాక్షిణ్యాలతో కాదన్నది అక్షర సత్యం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన కెసిఆర్ గారి దీక్షా కాలం ఉద్యమ జ్ఞాపకాలు నా గుండెలో పదిలంగా ఉన్నాయి… జై తెలంగాణ అని నినదీస్తున్నాయి. తెలంగాణ స్ఫూర్తిని నిత్యం రగిలిస్తున్నాయి…” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.