
HMDA : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి దూకుడు చూపించింది. ప్రత్యేకించి కోకాపేట ప్రాంతంలో ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. శుక్రవారం జరిగిన HMDA వేలంలో ఎకరం ధర కొత్త రికార్డు నమోదు చేసింది. గోల్డెన్ మైల్‌లోని ప్లాట్ నెంబర్ 15కు ఎకరానికి రూ.151.25 కోట్లు పలకడం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ భూములను జీహెచ్‌ఆర్ ఇన్‌ఫ్రా అత్యధిక ధరకు సొంతం చేసుకుంది. 4.03 ఎకరాల ఈ ప్లాట్ పై మొత్తం రూ.609.55 కోట్లు హెచ్‌ఎండీఏకు లభించాయి.
దీనికంటే కొద్దిగా తక్కువగా ప్లాట్ నెంబర్ 16 ధర పలికింది. ఈ ప్లాట్‌లో ఎకరానికి రూ.147.75 కోట్లకు గోద్రేజ్ సంస్థ దక్కించుకుంది. కోకాపేట నియోపోలిస్‌లో హెచ్‌ఎండీఏ నిర్వహిస్తున్న ప్లాట్ వేలం ఈ మధ్య ఇన్వెస్టర్ల పోటీని మరింత పెంచింది. ఈ ప్రాంతంలో భవిష్యత్‌లో అభివృద్ధి అవకాశాలు విపరీతంగా ఉండటంతో రియల్ ఎస్టేట్ డెవలపర్లు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. డిసెంబర్ 3న నిర్వహించనున్న మిగిలిన ప్లాట్ల వేలంతో మొత్తం వేలం ప్రక్రియ పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఇంకా ఎన్ని రికార్డులు నమోదవుతాయో రియల్ ఎస్టేట్ రంగం ఆసక్తిగా గమనిస్తోంది.