
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేటి నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఆదివారం రాంచిలో తొలి వన్డే మధ్యాహ్నం 1.30 నుంచి ఆరంభం కానుంది. సొంత గడ్డపై టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై తీవ్ర విమర్శలు ఎదురుకొంటున్న టీమిండియా.. వన్డే సిరీస్ అయినా గెలవాలని చూస్తోంది. ఏడాదికి పైగా విరామం తర్వాత సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు స్వదేశంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారు. దాంతో అందరి దృష్టీ రో-కోల పైనే ఉంది. ఈ ఇద్దరు ఎలా ఆడుతారో చూడాలి.
గాయం కారణంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వన్డే సిరీస్‌కు అందుబాటులో లేడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడు. వన్డే జట్టులో నిలదొక్కుకోవాలని యశస్వి చూస్తున్నాడు. విరాట్ కోహ్లీ మూడులో ఆడనుండగా.. నాలుగో స్థానం కోసం రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ మధ్య పోటీ నెలకొంది. రుతురాజ్ వైపే జట్టు యాజమాన్యం మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ లోకేష్ రాహుల్ అయిదో స్థానంలో ఆడతాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తాడు. నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ మిడిలార్డర్లో ఆడనున్నారు. అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా పేస్ భారాన్ని మోయనున్నారు. కోచ్ గంబీర్‌కు ప్రియమైన వ్యక్తి హర్షిత్ ఎలా ఆడుతాడో చూడాలి. ఈ మ్యాచులో రాణించకుంటే విమర్శలు రావడం పక్కా.
టెస్టు సిరీస్‌లో ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా.. వన్డే సిరీస్‌లో కూడా సత్తాచాటాలని చూస్తోంది. అయితే తుది జట్టులో చాలా మార్పులు జరగనున్నాయి. టెస్టులో ఆడిన తెంబా బవుమా, మార్‌క్రమ్, యాన్సెన్, కేశవ్ మహరాజ్, కార్బిన్ బోష్‌లు ఈ సిరీస్‌లో ఆడనున్నారు. డికాక్, బ్రీట్జ్‌కే, బ్రెవిస్, రుబిన్ హెర్మన్ వన్డేల్లో ఆడనున్నారు. వీరందరూ భారత బౌలర్లకు సవాలు విసరడం ఖాయం. గాయం కారణంగా పేసర్ రబాడ దూరం అయినా సఫారీల బౌలింగ్ పటిష్టంగానే ఉంది. యాన్సెన్, బర్గర్, ఎంగిడి, బోష్‌లతో టీమిండియా బ్యాటర్లకు ముప్పు తప్పదు. కేశవ్, మార్‌క్రమ్ స్పిన్ బౌలింగ్ వేయనున్నారు.
రాంచిలో పిచ్ నెమ్మదిగా ఉంటుంది. ఇక్కడ 5 వన్డేలు జరగగా.. భారీ స్కోర్లు మాత్రం నమోదు కాలేదు. ఒక్కసారి మాత్రమే 300 ప్లస్ స్కోర్ నమోదైంది. ఈ రోజు కూడా మోస్తరు స్కోర్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పిచ్‌లో 270-280 మంచి స్కోర్. ఇక 300 స్కోర్ అయితే దాదాపు విజయం సాధించినట్లే. రాంచిలో స్పిన్నర్లు ప్రభావం చూపుతారు. రాత్రి మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా):
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, ఆర్ జడేజా, నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్, డికాక్, బవుమా (కెప్టెన్), బ్రీట్జ్‌కే, బ్రెవిస్, రుబిన్ హెర్మన్, యాన్సెన్, బోష్, కేశవ్, బర్గర్, ఎంగిడి.