
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈరోజు నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో రాంచిలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. తెంబా బావుమా, కేశవ్ మహారాజ్‌లకు విశ్రాంతి ఇచ్చామని చెప్పాడు. ఈరోజు నలుగురు సీమర్లతో బరిలోకి దిగుతున్నట్లు మార్క్రమ్ తెలిపాడు. బావుమాకు రెస్ట్ ఇవ్వడంతో మార్క్రమ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.
భారత్ కెప్టెన్ కెఎల్ రాహుల్ మాట్లాడుతూ… ‘మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. బాగా ప్రాక్టీస్ చేశాం. చాలా మంది ప్లేయర్స్ జట్టులోకి తిరిగి వచ్చారు, టీమ్ చాలా ఉత్సాహంగా ఉంది. మిడిల్ ఓవర్లలో బాగా ఆడాలనుకుంటున్నాము. లభించే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దక్షిణాఫ్రికా మంచి జట్టు. బలమైన జట్టుపై మన నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది గొప్ప అవకాశం. ఈ రోజు ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పసర్లతో ఆడుతాం’ అని చెప్పాడు. నాలుగో స్థానం కోసం రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ మధ్య పోటీ ఉండగా.. రుతురాజ్ వైపే జట్టు యాజమాన్యం మొగ్గుచూపింది. టెస్టు సిరీస్‌ను కోల్పోయిన నేపథ్యంలో వన్డే సిరీస్ గెలిచి పరువు నిలుపుకోవాలని టీమిండియా చూస్తోంది.
Also Read: Google Pixel 10 Price Drop: గూగుల్ పిక్సెల్ 10పై 14 వేల తగ్గింపు.. ఎగబడిన జనం, స్టాక్ ఓవర్!
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
దక్షిణాఫ్రికా: ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డికాక్ (కీపర్), ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డీ జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సెన్, కోర్బిన్ బాష్, ప్రేనెలన్ సుబ్రాయెన్, నాంద్రే బర్గర్, ఓట్నీల్ బార్ట్‌మన్.