
India GDP Q2 2025: ఇంతగా ఎవరూ ఊహించలేదు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలు సైతం తారుమారయ్యాయి. వాస్తవానికి ఆర్బీఐ రెండవ త్రైమాసికంలో 7% GDP వృద్ధిని అంచనా వేసింది. కానీ తాజాగా ఆశ్చర్యకరమైన గణాంకాలు వెలువడ్డాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) భారత ఆర్థిక వ్యవస్థ అసాధారణంగా పని తీరును కనబరిచింది. ఈ కాలంలో GDP వృద్ధి గత ఆరు త్రైమాసికాలలో అత్యధికంగా నమోందైంది. ప్రభుత్వ డేటా ప్రకారం.. రెండవ త్రైమాసికంలో వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (GDP) 8.2% రేటుతో దూసుకుపోయింది. అనేక ప్రపంచ, దేశీయ రేటింగ్ ఏజెన్సీలు రెండవ త్రైమాసికంలో GDP వృద్ధిని 7.0 నుంచి 7.3% వరకు అంచనా వేశాయి. కానీ.. అంచనాలన్నింటిని తలదన్నేలా జీడీపీ నమోదైంది. ఇంతలా పెరుగుదలకు మూడు ప్రధాన కారణాల గురించి తెలుసుకుందాం..
READ MORE: Nidhhi Agarwal : ప్లీజ్ నాకు ఒక్క హిట్ ఇవ్వండి ప్రభాస్ రాజు గారు
1. తయారీ రంగంలో బలమైన వృద్ధి
రెండవ త్రైమాసికంలో భారతదేశ జీడీపీకి తయారీ రంగం బలమైన మద్దతును అందించింది. ఈ రంగం 9% కంటే ఎక్కువ రేటుతో వృద్ధి చెందింది. స్థిరమైన ముడి పదార్థాల ఖర్చులు, ఉత్పత్తిని పెంచడానికి కంపెనీల సామర్థ్య విస్తరణ, ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, ఆటో, ఎలక్ట్రిక్ వాహనాలు, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలలో రికార్డు ఉత్పత్తి పెరిగింది. దీంతో జీడీపీ దూసుకుపోయింది. ఇంకా, ప్రభుత్వ ప్రజా ప్రయోజన లైసెన్సింగ్ (PLI) పథకం గణనీయమైన పాత్ర పోషించింది. తయారీ రంగం GDPకి మాత్రమే కాకుండా ఉపాధిని పెంచడానికి సైతం దోహదపడింది.
2. సేవల రంగం
సేవల రంగం గణనీయమైన పాత్ర పోషించింది. సేవల రంగం 10% వరకు బలమైన వృద్ధిని కనబరిచింది. ఇందులో ఆర్థికం, బీమా, రియల్ ఎస్టేట్ ముఖ్యంగా ముఖ్యమైన పాత్ర పోషించాయి. దేశీయ డిమాండ్ పెరుగుదల కూడా ఒక ముఖ్యమైన అంశం. ఈ రంగం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద విభాగాన్ని సూచిస్తుంది.
3. బలమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులు
ప్రభుత్వం దూకుడుగా మూలధన వ్యయం (భవనాలు, యంత్రాలు, భూమి వంటి స్థిర ఆస్తులను కొనుగోలు చేయడానికి లేదా మెరుగుపరచడానికి ఒక సంస్థ లేదా ప్రభుత్వం చేసే ఖర్చు)పై ఖర్చ చేయడం GDP పెరుగుదలకు ఒక కారణం. రోడ్లు, రైలు, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయడం నిర్మాణ కార్యకలాపాలను పెంచింది. ఇంకా, జీఎస్టీ కూడా పరోక్షంగా జీడీపీ వృద్ధికి తోడ్పడింది. సెప్టెంబర్ 22న అమలు చేసిన జీఎస్టీ సంస్కరణ దేశీయ డిమాండ్లో భారీ పెరుగుదలకు దారితీసింది. అంతే కాదు.. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు జీడీపీ వృద్ధికి తోడ్పడ్డాయి.