
Indus Valley Civilisation: ప్రపంచంలోనే అతిపెద్ద నాగరికతల్లో ఒకటి ‘‘సింధులోయ నాగరికత’’. హరప్పా, మొహంజోదారో లాంటి గొప్ప పట్టణాలు 5000 ఏళ్లకు పూర్వమే ఉన్నాయి. వాయువ్య భారతదేశం, పాకిస్తాన్ లో ఈ నాగరికత సింధు నది వెంబడి ఏర్పడింది. అయితే, అనూహ్యంగా ఈ నాగరికత అదృశ్యమైంది. ఇంత గొప్ప సివిలైజేషన్ ఎలా నాశనం అయిందనే దానికి అనే సిద్ధాంతాలు ఉన్నాయి. కరువు, వరదల కారణంగా సింధు నాగరికత దెబ్బతిన్నట్లు చెబుతుంటారు.
అయితే, ఐఐటీ గాంధీనగర్‌కు చెందిన పరిశోధకులు హరప్పా, మొహంజోదారో, రాఖీగఢి, లోథాల్ వంటి పట్టణాలను ప్రజలు ఎందుకు విడిచి పెట్టాల్సి వచ్చిందనే దానికి కొన్ని కారణాలు వివరించారు. కరువుల ప్రభావం నాగరికతను దెబ్బతీసినట్లు వీరు చెబుతున్నారు. వ్యవసాయం, అభివృద్ధి చెందిన పట్టణాలు, డ్రైనేజ్ వ్యవస్థ వంటివి ఈ నాగరికతను ప్రత్యేకంగా నిలిపాయి. ‘కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్’ జర్నల్‌లో వచ్చిన రీసెర్చ్ పేపర్ ప్రకారం, నీటి కొరత వల్లే నాగరికత అంతరించిపోయినట్లు చెప్పింది.
వాతావరణ మార్పులు, నీటి కొరత:
సింధు నది నాగరికతకు జీవనాడి వ్యవసాయం, వాణిజ్యం. శాస్త్రవేత్తలు ప్యాలియోక్లైమేట్ రికార్డులు (గుహల్లో ఏర్పడే స్టాలక్టైట్లు, సరస్సు మట్టిపొరలు, పురాతన వృక్షాల అవశేషాలు), అత్యాధునిక వాతావరణ మోడళ్ల ద్వారా సింధు నాగరికత ఎలా మాయమైందనే దానికి కారణాలను వివరించారు. సగటు వర్షపాతంలో 10-20 శాతం తగ్గడం, దాదాపుగా 0.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరగడం, నాలుగు కరువులు ఒక్కొక్కటి 85 ఏళ్లకు మించి ఉండటం, ఒక కరువు సుమారుగా 164 ఏళ్ల పాటు కొనసాగడం నాగరికతను దెబ్బతీశాయి. ఈ కరువులు 4450-3400 ఏళ్లకు పూర్వం గుర్తించబడ్డాయి. వీటి వల్ల సింధు నాగరికత విస్తరించిన ఉన్న ప్రాంతంలో 91 శాతం ప్రభావితమైంది.
వ్యవసాయంపై ప్రభావం:
ముందుగా సింధు నాగరికత నదీ పరివాహక ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. అయితే, వర్షపాత తగ్గడం వల్ల, కరువులు తీవ్రంగా మారడం వల్ల వ్యవసాయం కష్టమైంది. కరువులతో పాటు నదీ ప్రవాహాలు దిశలు మార్చుకోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. రైతులు గోధుమ, బార్లీ పంటలకు బదులుగా కరువును తట్టుకునే చిరు ధాన్యాల సాగుకు మారారు. అయితే, కరువు పరిస్థితులు వీటి సాగును కూడా దెబ్బతీశాయి. 3,531-3,418 సంవత్సరాల క్రితం జనాలు నగరాలు, పట్టణాలను వదిలి చిన్న చిన్న గ్రామ సమూహాలుగా స్థిరపడినట్లు పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి.
ప్రపంచ వాతావరణమే కారణం:
ఎల్ నినో సంఘటనలు, ఉత్తర అట్లాంటిక్ సముద్రం చల్లబడటం భారత రుతుపవనాలను దెబ్బతీశాయి. సింధు నాగరికత ఆకస్మికంగా అంతం కాలేదని, ఆనాటి ప్రజలు పరిస్థితుల్ని తట్టుకునేందుకు అనేక విధాలుగా పోరాడారని పరిశోధకులు చెబుతున్నారు. దీర్ఘకాలిక కరువుల వల్ల సమాజాలు వలసలు వెల్లడం, నాగరికత చిన్న యూనిట్లుగా విభజించబడిందని, నాగరికత పూర్తిగా అదృశ్యం కాకుండా తన పరివర్తన చెందిందని చెబుతున్నారు.