Maharashtra: బీజేపీ-శివసేన మధ్య విభేదాలు! కూటమి నిలబడేనా?

Differences Between Bjp And Shiv Sena Parties In Maharashtra

స్థానిక ఎన్నికల సమయంలో మహారాష్ట్ర కూటమి ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా తెలుస్తోంది. శివసేనకు చెందిన మంత్రి వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య వార్ మొదలైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇరు పార్టీల నాయకుల మధ్య సైలెంట్ ఫైటింగ్ నడుస్తున్నట్లుగా సమాచారం.

మహారాష్ట్రలోని నందూర్‌బార్‌లో జరిగిన బహిరంగ సభలో విద్యాశాఖ మంత్రి దాదా భూసే మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఏక్‌నాథ్ షిండే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని.. మహారాష్ట్రకు ఏక్‌నాథ్ షిండే నాయకత్వాన్ని మనమంతా చూడబోతున్నామని తెలిపారు. పార్టీలోని నేతలంతా షిండే బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా షిండే లాంటి ముఖ్యమంత్రిని మహారాష్ట్ర ప్రజలు చూడలేదని.. భవిష్యత్‌లో కూడా చూడబోరని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేటికీ ప్రజల హృదయాల్లో షిండే ముద్ర పడిపోయారని.. ముఖ్యమంత్రి ఎవరు అని ప్రజలను అడిగితే.. తమ హృదయాల్లో షిండేనే ఉన్నారని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. భవిష్యత్ కోసం ఎవరూ చింతించొద్దని.. కచ్చితంగా షిండేనే మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారన్నారు. నగరాలు అభివృద్ధి చెందాలంటే ‘ప్యానెల్ టు ప్యానెల్’, విల్లు, బాణాన్ని ఆశీర్వదించాలని ప్రజలకు దాదా భూసే విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: Off The Record: మీనాక్షి నటరాజన్ వైఖరిపై గాంధీ భవన్ లో గుసగుసలు..!

ఇక శివసేన మంత్రి అలా మాట్లాడితే.. శివసేనకు చెందిన మరో ఎమ్మెల్యే నీలేష్ రాణే కూడా బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం రాత్రి మాల్వాన్ నగరంలో బీజేపీ కార్యకర్త విజయ్ కెనవడేకర్ ఇంటి నుంచి పోలీసులు రూ.25 లక్షలు స్వాధీనం చేసుకున్నారని.. ఓటర్లకు పంచడానికి ముందుగానే దాచి పెట్టారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు.. ఓటర్లను డబ్బుతో ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి:PM Modi: టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన మహిళా అంధుల క్రికెట్‌ జట్టును కలిసిన ప్రధాని మోడీ..

ఓ వైపు శివసేన మంత్రి.. ఇంకో వైపు ఎమ్మెల్యే.. బీజేపీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించడంతో రెండు పార్టీల మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో శివసేనపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. కలిసుంటూనే ఇదేం పద్ధతి అంటూ బీజేపీ లీడర్స్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకు ఏక్‌నాథ్ షిండేనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్నికల తర్వాత బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంతో షిండేను పక్కన పెట్టి దేవేంద్ర ఫడ్నవిస్‌కు బీజేపీ అధిష్టానం పట్టం కట్టింది. ఈ వ్యవహారం మొదటి నుంచి షిండే వర్గానికి రుచించలేదు. తాజాగా ఆ కోపాన్ని ఇలా బయటకు వెళ్లగక్కుతున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఆరోపణలకు హైకమాండ్ ఫుల్‌స్టాప్ పెడుతుందా?.. లేదంటే లైట్‌ తీసుకుంటుందో వేచి చూడాలి.