
బ్రెయిన్ స్ట్రోక్ అనేది అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. ఇది సంభవించిన వెంటనే చికిత్స అందించకపోతే, ప్రాణాలు కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ ప్రాణాంతక పరిస్థితిని ముందుగానే అరికట్టేందుకు స్విస్ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. రక్తనాళాల్లో ప్రయాణిస్తూ మెదడులో రక్తం గడ్డకట్టిన ప్రాంతాన్ని గుర్తించి తొలగించే మైక్రో రోబోట్లను వారు అభివృద్ధి చేశారు.
ఈ మైక్రో రోబోట్లను చేతి భాగం లేదా తొడ ప్రాంతం ద్వారా చిన్న సూదితో రక్తనాళాల్లోకి పంపుతారు. రక్తప్రవాహంతో పాటు ఇవి మెదడు వరకు చేరి, రక్తం గడ్డకట్టిన ప్రాంతాన్ని గుర్తిస్తాయి. అనంతరం ఆ గడ్డను విచ్ఛిన్నం చేసి, కేవలం కొన్ని నిమిషాల్లోనే మెదడుకు రక్తప్రవాహాన్ని పునరుద్ధరిస్తాయి. క్యాథెటర్ చేరలేని అతి చిన్న రక్తనాళాల్లో కూడా ఈ రోబోట్స్ పనిచేయగలగడం విశేషం.
స్ట్రోక్ వచ్చినప్పుడు చికిత్స ఆలస్యం అయితే మెదడులో కొన్ని కణాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. కానీ ఈ మైక్రో రోబోట్ల సహాయంతో అత్యవసర పరిస్థితుల్లోనే రక్తప్రసరణను తిరిగి ప్రారంభించగలిగితే, ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.అంబులెన్స్‌లు, గ్రామీణ క్లినిక్‌లు, హైవేలపై ఉండే పోర్టబుల్ స్ట్రోక్ యూనిట్లు వంటి ప్రదేశాల్లో వీటిని అందుబాటులో ఉంచితే, స్ట్రోక్ కారణంగా సంభవించే మరణాలు పెద్దఎత్తున తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వైద్యరంగంలో ఈ మైక్రో రోబోట్ల ఆవిష్కరణ ఒక గొప్ప ముందడుగు మాత్రమే కాక, భవిష్యత్తులో స్ట్రోక్ చికిత్సలో కొత్త మైలురాయిగా నిలిచిపోతుందని నిపుణులు భావిస్తున్నారు.