
బైపోల్ వార్ కోసం బీఆర్ఎస్ కొత్త అస్త్రాలను సిద్ధం చేసుకుంటోందా? జూబ్లీహిల్స్ అనుభవం ఆ పార్టీకి సరికొత్త పాఠం నేర్పిందా? అందుకే స్టేషన్ ఘన్‌పూర్‌లో గేమ్ మారిపోయి ప్లాన్ ఎ, ప్లాన్ బీ కూడా తెర మీదికి వచ్చాయా? బలమైన ఇద్దరు నేతల్ని చేర్చుకుని కాంగ్రెస్‌ని దెబ్బ కొట్టాలనుకుంటోందా? ఎవరా ఇద్దరు? ఘన్పూర్ గేమ్ ప్లాన్ ఏంటి? జూబ్లీహిల్స్ ఓటమితో దిమ్మతిరిగిపోయిన బీఆర్ఎస్ అధిష్టానం ఇక అలర్ట్ అయిపోయిందట. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడితే జరిగే ఉప ఎన్నికల కోసం ఇప్పటి నుంచే స్కెచ్‌లు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఇక్కడ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఓడించాలని కంకణం కట్టుకున్నారట గులాబీ పెద్దలు. అందులో భాగంగానే కడియంకు దీటైన నేత కోసం వెదుకుతున్నట్టు సమాచారం. ముందుగా కడియంతో రాజకీయ వైరం ఉన్న తాటికొండ రాజయ్యని నియోజకవర్గంలో యాక్టివ్ చేసిన గులాబీ అధిష్టానం .. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అదే సమయంలో కడియం శ్రీహరి కూడా మానసికంగా ఉప ఎన్నికకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే 1500 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడంతో పాటు పనులు కూడా మొదలుపెట్టారు. దీంతో ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న బీఆర్ఎస్ పెద్దలు ఒకవేళ రాజయ్య కడియంను దీటుగా ఎదుర్కోలేకపోతే ఎలాగన్న డౌట్‌తో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారట. అందులో భాగంగానే… లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీ మారి బీజేపీలో చేరిన ఆరూరి రమేష్ వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ముఖ్యులు ఇప్పటికే ఆరూరికి టచ్‌లోకి వెళ్లినట్టు చెప్పుకుంటున్నారు. ఆయన కూడా కారెక్కాలని చాలా రోజుల నుంచి ఉవ్విళ్లూరుతున్నట్టు ప్రచారం ఉంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీలో అంత యాక్టివ్‌గా లేరు ఆరూరి రమేష్.తప్పని పరిస్థితుల్లో మాత్రమే పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు. కారు పార్టీ నుంచి వచ్చిన సంకేతాలే అందుకు కారణం అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి స్టేషన్‌ఘన్‌పూర్‌లో. గులాబీ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్‌రావుకి అత్యంత సన్నితుడు ఆరూరి.
కేటీఆర్ కూడా ఆయన విషయంలో సానుకూలంగా ఉండటంతో…దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టేనని భావిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీలో పనిచేసినప్పుడు నియోజకవర్గంలో తయారు చేసుకున్న కేడర్ ఇప్పటికీ ఆయనకు టచ్‌లో ఉందట. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకునే బీఆర్ఎస్ ముఖ్యులు అంగ బలం, అర్ధ బలం పుష్కలంగా ఉన్న రమేష్‌వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం బీజేపీలో ఉండీ లేనట్టుగా ఉన్న ఆరూరి కూడా ఘర్ వాపసీ కోసం ఆతృతగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో ఏవైనా అనుకోని అవాంతరాలు ఎదురై…. రమేష్ కారెక్కడం కుదరకపోతే ఏం చేయాలన్న అంశం మీద కూడా దృష్టి పెట్టిందట బీఆర్ఎస్ అధిష్టానం. నియోజకవర్గంలో పట్టున్న మరో నేత, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఇందిర వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి గెలిచి హస్తం పార్టీలో చేరాక ఇందిర పొలిటికల్ ఉక్కపోత ఫీలవుతున్నారట. అందుకే ఆమెను గులాబీ దళంలోకి ఆహ్వానించి రివర్స్ ఇంజినీరింగ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన సైతం ఉన్నట్టు తెలిసింది. కడియం మీద ఉన్న కోపంతో ఇందిర కూడా….బీఆర్ఎస్కు సానుకూల సంకేతాలు పంపినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ రకంగా ఎట్నుంచి ఎటు చూసినా… ఉప ఎన్నిక అంటూ జరిగితే… ఎట్టి పరిస్థితుల్లో స్టేషన్ఘన్పూర్ను వదులుకోకూడదని పట్టుదలగా ఉన్నారట బీఆర్ఎస్ పెద్దలు. ఈరోజు కాకున్నా… మరో ఏడాదిలోపైనా ఉప ఎన్నిక జరుగతుందన్న నమ్మకంతో… బీఆర్ఎస్ వేస్తున్న స్కెచ్‌లు లోకల్ పాలిటిక్స్‌ను రక్తి కట్టిస్తున్నాయి.