Pawan Kalyan: దేశంలో ఓ అరుదైన ఘట్టం అమరావతిలో చోటుచేసుకుంది!

Deputy Cm Pawan Kalyan Said Rare Historic Moment In Amaravati

అమరావతి ఆర్థిక పురోగతికి పునాది పడిన రోజు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో ఇదొక బృహత్తర కార్యక్రమం అని పేర్కొన్నారు. రాష్ట్ర పురోగతి కోసం ప్రతి అడుగు అభివృద్ధికి ప్రధాని మోడీ అందిస్తున్న సహాయ సహకారాలు మర్చిపోలేనిదన్నారు. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సహాయం కాగితాల్లో కరిగిపోకుండా.. జవాబుదారితనం, మంచి సారథ్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. అమరావతి ఆర్థిక కేంద్రంగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరండిప్యూటీ సీఎం పవన్ మాట్లాడారు.

‘రాష్ట్ర భవిష్యత్ కోసం, రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములు కేటాయించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని మోడీ అనేక సహాయ సహకారాలు అందించారు. దేశంలో ఓ అరుదైన ఘట్టం రాజధాని అమరావతిలో చోటుచేసుకుంది. ఎక్కడా లేని విధంగా 13 వందల కోట్ల పెట్టుబడితో 6500 ఉద్యోగాల కల్పనతో రికార్డ్ సృష్టించింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. విశాఖ స్టీల్ ప్లాంటు కోసం 11 వేల కోట్ల రూపాయలు విడుదల చేయటం, అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేళ కోట్లు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు. అమరావతి రైతులు ఎక్కడ ఆందోళన చెందొద్దు.. మీకోసం మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాము’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు.

Also Read: Pinnelli Brothers: పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో షాక్!

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ’… ‘నిర్మలా సీతారామన్ మహిళలకే కాదు నాలాంటి వారికి ఓ స్ఫూర్తి. ఓ మహిళ నేత 8 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత నిర్మలా గారికి దక్కింది. జీఎస్టీ సంస్కరణలు చేసి పేదవాడి మనసు దోచుకున్న వ్యక్తి నిర్మలా సీతారామన్. ప్రపంచంలో ల్యాండ్ పూలింగ్ చేసిన దేశాలు 4 మాత్రమే, అది కూడా కేవలం 2000 వేల ఎకరాలు. కానీ అమరావతిలో మాత్రం రికార్డు స్థాయిలో 33 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ జరిగింది. అత్యంత ఆధునిక ప్రణాళిక బద్ద రాజధానిగా అమరావతి రూపాంతరం చెందబోతోంది’ అని అన్నారు.